సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి
ఎస్.వినయకుమార్, తెలంగాణ సాహితి సంస్థ
రాష్ట్ర కార్యదర్శి కె.ఆనందాచారి
ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో ‘కవి సమ్మేళనం’
నవతెలంగాణ – ముషీరాబాద్
కుల రహిత సమాజ స్థాపనకు కవులు తమ కలాలకు పదును పెట్టాలని, అందుకు ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో భారీ ‘కవి సమ్మేళనం’ నిర్వహించనున్నట్టు సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్. వినయకుమార్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కవి సమ్మేళనానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులం.. అభివృద్ధికి ఆటంకంగా ఉందని, ఈ దేశంలో మనిషి హక్కులు ఆయన పుట్టుక ఆధారంగానే నిర్ణయించబడటం దురదృష్టకరమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి పౌర హక్కులు కుల వ్యవస్థ వల్ల సామాన్యుడికి నిరాకరించబడుతున్నాయని తెలిపారు. మనిషి ఎదుగుదలకు కులం అతిపెద్ద ఆటంకంగా మారిందన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కుల వివక్షను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. అందుకే కుల నిర్మూలన సాంస్కృతికోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కవి సమ్మేళనంలో కవులు, రచయితలు పెద్ద ఎత్తున పాల్గొని తమ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ సాహితి రాష్ట్ర కార్యదర్శి కె.ఆనందాచారి మాట్లాడుతూ.. అక్షరం ద్వారా సామాజిక మార్పు సాధ్యమని తెలిపారు. ఏప్రిల్ 5న జరిగే ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, మేధావులు పాల్గొని కలాలు, గళాలనే కాకుండా కుల నిర్మూలన గళాలను వినిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రపంచం ఆధునీకరించబడుతుందని, కానీ కులం, మతం అభివృద్ధికి అడ్డు గోడలుగా ఉన్నాయని అన్నారు. వాటిని ఛేదించే ప్రత్యామ్నాయ సాంస్కృతిక పోరాటంలో కవులు, కళాకారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాలోత్సవం ఉపాధ్యక్షురాలు సుజావతి, తెలంగాణ సాహితీ సహయ కార్యదర్శి అనంతోజు మెహన్ కృష్ణ, నాయకులు మహేష్ దుర్గే తదితరులు పాల్గొన్నారు.
కులరహిత సమాజ స్థాపనకు కవులు కలాలకు పదును పెట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



