షోపియాన్ శాంతియుత సభలో లాఠీచార్జి
పలువురు కార్యకర్తలకు గాయాలు
ఖాకీల దౌర్జన్యకాండను ఖండించిన శ్రేణులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ‘జన ఆక్రోశ్ జాతా’ లో భాగంగా శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో పోలీసులు వీరంగం సృష్టించారు. దొరికిన వారిని దొరికినట్టుగా లాఠీలు ఝుళిపించారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో పాటు పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. అంతేకాక సభకు వచ్చిన వారి నుంచి పోలీసులు ఫోన్లను లాక్కున్నారు. ఈ సందర్భంగా ఖాకీల దౌర్జన్యకాండను సీపీఐ(ఎం) ఖండించింది. దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జమ్మూకాశ్మీర్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ఈనెల 24న ఢిల్లీలో నిర్వహించ నున్న మహా బహిరంగసభ సన్నాహక సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
దీంతో పాటు పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్న విషయం విదితమే. పంజాబ్‌లో కొనసాగిన జాతా పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని ఫాజిల్కాలో పర్యటించింది. అబోహర్ పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి సుఖ్వీందర్ సింగ్ సెఖోన్, కేంద్ర కమిటీ సభ్యుడు కెఎన్ ఉమేష్ ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొనసాగిన జాతా సిమ్లాలో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. రాజస్థాన్‌లో జరిగిన జాతాలో భాగంగా సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బృందా కరత్ గిరిజన గ్రామాలను సందర్శించారు.



