నవతెలంగాణ – కామారెడ్డి : జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా ప్రక్రియ కూడా నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు.
ప్రజలు అనవసర ఆందోళనకు గురి కాకుండా, ఒకేసారి బంకులకు చేరుకోకుండా పలు ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు సాధారణ పరిస్థితులు దెబ్బతినే అవకాశముందని ఎస్పీ హెచ్చరించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి వాహనదారులు తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపుకోవడానికి లేదా అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించవద్దని సూచించారు. ఇలా చేయడం వల్ల ఇతరులకు అనవసర ఇబ్బందులు కలుగుతాయని, సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనాన్ని వినియోగించుకోవాలని కోరారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే, వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆ ప్రకటనలో హెచ్చరించారు.



