ఇతర నిందితులతో కలిపి ప్రభాకర్‌రావును విచారించిన సిట్ అధికారులు
పెన్‌డ్రైవ్ నుంచే ఆధారాలు సేకరించిన సిట్
ఫోన్ ట్యాపింగ్ వెనుక బీఆర్‌ఎస్ రాజకీయ ప్రముఖుల పాత్రను గుర్తించిన అధికారులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురువారం కీలక దశకు చేరుకున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును 14 రోజుల పాటు విచారించిన సిట్ అధికారులు అనేక కీలక ఆధారాలను సేకరించారు. గురువారం చివరి రోజు కాగా…ఆయనతో పాటు ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన బెయిల్‌పై ఉన్న ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రవీణ్‌రావు, నగర్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతయ్య, ఒక మీడియా ఛానల్ యజమాని శ్రవణ్‌కుమార్‌లను కలిపి జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో అధికారులు 10 గంటలకుపైగా విచారించారు. అంతకు ముందు ఫోన్ ట్యాపింగ్ జరిపే విషయంపై ప్రభాకర్‌రావు తనకు ఇచ్చిన ఆదేశాల గురించి మరోసారి పై నలుగురు అధికారులను మరోసారి సిట్ అధికారులు విచారించారు. ఆ సమయంలో ప్రభాకర్‌రావును ఎదుటగానే ఉంచుకుని వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మధ్యలో వారు చెబుతున్న అంశాలపై ప్రభాకర్‌రావును క్రాస్ ఇంటరాగేషన్ చేసి కొన్ని కీలక వివరాలను రాబట్టినట్టు తెలిసింది.
ఆ సమయంలో సైతం ప్రభాకర్‌రావు కొన్ని ప్రశ్నలకు నో అంటూ సమాధానం ఇచ్చాడని తెలిసింది. కాగా, ఆయన నో అన్నప్పటికీ ఆయన కింద పనిచేసిన పై నలుగురు అధికారులు ఇచ్చిన సమాచారంలో ఉన్న నిజాలను దర్యాప్తు అధికారులు గట్టిగా విశ్వసిస్తూ దానికి సంబంధించిన ఆధారాలను సైతం సేకరించినట్టు తెలిసింది. మొత్తం మీద ఈ కీలక విచారణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన వ్యవహారం, జరిపించింది ఎవరు? వారి నేరాన్ని రుజువు చేసే ఆధారాలను సిట్ అధికారులు సమగ్రంగా సేకరించినట్టు తెలిసింది. శుక్రవారంతో ప్రభాకర్‌రావు కస్టడీకి సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు పూర్తికానుండటంతో ఆయనను విడుదల చేయడానికి అవసరమైన చర్యలను కూడా సిట్ అధికారులు తీసుకుంటున్నట్టు తెలిసింది. కాగా, ప్రభాకర్‌రావుకు సంబంధించిన పెన్‌డ్రైవ్ నుంచి ఫోన్ ట్యాపింగ్ చేశారనడానికి కీలకమైన ఆధారాలను అధికారులు విశ్లేషించి సేకరించారని సమాచారం. బీఆర్‌ఎస్‌కు చెందిన ప్రముఖ నేతల పాత్రను కూడా గుర్తించినట్టు తెలిసింది. ఈ విచారణలో సిట్ సభ్యులు అంబర్‌కిశోర్ ఝా, విజయ్ కుమార్, రితురాజ్, నారాయణరెడ్డి, శ్రీధర్, వెంకటగిరి తదితరులు పాల్గొన్నారు.
ప్రభాకర్‌రావు కుమారుడిని విచారించిన సిట్
ఇదిలా ఉంటే, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు కుమారుడు నిశాంత్‌రావును సిట్ అధికారులు గురువారం నాలుగు గంటల పాటు విచారించారు. నిశాంత్‌రావు చేసే వ్యాపారాలు, ఇతర ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీసినట్టు తెలిసింది. ముఖ్యంగా, అతని బ్యాంక్ స్టేట్‌మెంట్లను ముందు ఉంచుకుని అందులో తమకు ఉన్న అనుమానాలను నిశాంత్ రావు ద్వారా నివృత్తి చేసుకునే ప్రయత్నాన్ని సిట్ అధికారులు చేశారు.
మాజీ సీఎస్, డీజీపీలను విచారించిన సిట్ అధిపతి సజ్జనార్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను చరమాంకానికి చేర్చుతూ సిట్ అధిపతి, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ డీజీపీలను విచారించినట్టు తెలిసింది. బంజారాహిల్స్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలోని తన ఛాంబర్‌కు మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్, మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిలను సజ్జనార్ పిలిపించి విచారణ జరిపినట్టు తెలిసింది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును అత్యంత కీలకమైన ఎస్‌ఐబీ ఓఎస్‌డీగా నియమించడానికి గల కారణాలను సోమేశ్‌కుమార్, మహేందర్‌రెడ్డి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారని తెలిసింది. సాధారణంగా పదవీ విరమణ చేసిన అధికారులను ఎస్‌ఐబీ వంటి విభాగానికి ఇన్‌చార్జిగా నియమించడం ఎంత వరకు సబబు అంటూ కూడా ఆయన సమాధానాలను రాబట్టే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. కాగా, ఈ పూర్తి విచారణలో ఆ సమయంలో ఏ నిర్ణయం జరిగినా ప్రభుత్వ ఆదేశాల మేరకే అని మాజీ అధికారులు తెలిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, ప్రభాకర్‌రావు హయాంలో ఎస్‌ఐబీ జరిపిన ఫోన్ ట్యాపింగ్‌లలో చాలా వరకు మావోయిస్టులకు సబంధించిన నెంబర్లు అని రివ్యూ కమిటీకి సిఫారసు చేసినట్టు కూడా అధికారులు చెప్పినట్టు తెలిసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నందన్‌కుమార్‌ను విచారించిన సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా డక్కన్ కిచెన్ యజమాని హోటల్ యజమాని నందకుమార్‌ను సిట్ అధికారులు గురువారం నాలుగు గంటల పాటు విచారించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి నందకుమార్‌పై ఆరోపణలు చేసి సైబరాబాద్ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. కాగా, తన ఫోన్‌ను ఆ సమయంలో ట్యాపింగ్ చేశారంటూ నందకుమార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు నందకుమార్‌ను పిలిచి తన ఫోన్లను ట్యాపింగ్ జరిగినట్టు ఎప్పుడు గుర్తించారు? అనే కోణంలో విచారించారు. ముఖ్యంగా తనతో సింహాద్రియాజులు మరికొందరు మాట్లాడిన ఆడియో రికార్డింగ్‌లను ఆ సమయంలో బీఆర్‌ఎస్ నాయకులు విడుదల చేశారనీ, దాంతో తన ఫోన్‌లు ట్యాపింగ్‌కు గురైనట్టు గ్రహించి ఫిర్యాదు కూడా చేసినట్టు నందకుమార్ తెలిపారు. దీనిపై మరికొన్ని ప్రశ్నలు వేసిన సిట్ అధికారులు నందకుమార్ స్టేట్ మెంట్‌ను రికార్డు చేసి పంపించేశారు.వెలుపలికి వచ్చిన నందకుమార్ తన ఫోన్ ట్యాపింగ్ జరిగిన అంశాలపై సిట్‌కు పూర్తి సమాచారాన్ని అందజేశానని తెలిపారు.



