నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వచ్చిన కుటుంబంలో చోటుచేసుకున్న ఆందోళనకర సంఘటనకు స్థానిక పోలీసులు వెంటనే స్పందించి, తప్పిపోయిన 10 ఏళ్ల బాలికను సురక్షితంగా కనుగొని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందిన గట్టు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మంగళవారం రాజన్న దర్శనానికి వచ్చిన వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. దర్శనం అనంతరం కొద్ది సమయంలోనే వారి కుమార్తె స్నేహిత కనిపించకపోవడంతో కుటుంబంలో తీవ్ర ఆందోళన చెలరేగింది. వెంటనే వారు ఈ విషయాన్ని వేములవాడ పోలీసులకు తెలియజేశారు.
సమాచారం అందుకున్న వెంటనే పట్టణ పోలీసులు, బ్లూ కోట్ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలను ప్రారంభించారు. రద్దీగా ఉండే సినిమా రోడ్డులో బాలికను సురక్షితంగా గుర్తించిన పోలీసులు, అనంతరం ఆమెను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.తమ చిన్నారిని సురక్షితంగా కనుగొన్నందుకు గట్టు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. గాలింపు చర్యల్లో చురుకైన పాత్ర పోషించిన బ్లూ కోట్ సిబ్బందిని పట్టణ సీఐ వీరప్రసాద్ అభినందించారు. తప్పిపోయిన బాలికను తక్షణమే గుర్తించి కుటుంబానికి అందించిన పోలీసుల అప్రమత్తత, స్పందనను స్థానికులు ప్రశంసిస్తున్నారు.



