Thursday, February 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయువ లాయర్‌ హత్యను ఛేదించిన పోలీసులు

యువ లాయర్‌ హత్యను ఛేదించిన పోలీసులు

- Advertisement -

– ఆస్తి కోసం చెల్లిని చంపించిన అన్న
– హత్యకు భూ వివాదాలే కారణం : చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ గౌతం వివరాలు వెల్లడి
నవతెలంగాణ-మొయినాబాద్‌

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం జరిగిన మహిళా లాయర్‌ హత్య కేసు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమె సోదరుడే అతి దారుణంగా చంపినట్టు పోలీసులు గుర్తించారు. ఆస్తి వివాదం కారణంగానే బాధితురాలి సోదరుడు మరికొందరితో కలిసి కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపినట్టు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు ఆమె సోదరుడితో పాటు మరికొంతమందిని అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను చేవెళ్ల డీసీపీ యోగేష్‌ గౌతం మీడియాకు వెల్లడించారు. స్వప్న, ఆమె సోదరుడు రాజుకు మధ్య కొన్ని రోజులుగా భూ వివాదం నడుస్తోంది. 10 ఎకరాల భూమిని వారి తల్లి ఇద్దరికీ పంచిందని, రాజుకు 6 ఎకరాలు, స్వప్నకు 4 ఎకరాలు రాసి ఇచ్చినట్టు తెలిపారు. కానీ స్వప్నకు 4 ఎకరాలు ఇవ్వడం ఇష్టం లేని రాజు.. ఇటీవలి కాలంలో పదే పదే స్వప్పతో గొడవలకు దిగుతున్నాడు. ఈ పరిస్థితుల్లో తన సోదరుడు రాజుపై లాయర్‌ స్వప్న ఇప్పటికే రెండు కేసులు పెట్టింది. ఈ కేసులు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం తన తల్లి రాసిచ్చిన 4 ఎకరాల భూమిలో సర్వే పనులు చేయించేందుకు స్వప్న అక్కడికి వెళ్లింది. అందులో ఒక ఎకరం భూమిని విక్రయించేందుకు ప్రయత్నం చేస్తున్న విషయం రాజుకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్న రాజు.. స్వప్నతో వాగ్వాదానికి దిగాడు. ఇది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీయడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో స్వప్నపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా బండరాయిని తీసుకొచ్చి ఆమెను కొట్టి అత్యంత దారుణంగా చంపినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. రాజుతో పాటు అతని డ్రైవర్‌ గణేష్‌, సహా మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. ఈ హత్య కేసు దర్యాప్తు కోసం 4 స్పెషల్‌ పోలీస్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామని, పరారీలో ఉన్న ఇంకో వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. లాయర్‌ స్వప్నకు ఇంకా వివాహం కాలేదని తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన బాధితురాలి తల్లి వెంకటమ్మ తన కుమార్తెను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మూడేండ్లుగా స్వప్నను చంపేందుకు రాజు ప్లాన్‌ చేస్తున్నాడని, ఇప్పటికే రెండుసార్లు హత్య చేసేందుకు ప్రయత్నం చేశాడని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -