సీబీఐ దర్యాప్తునకు ఏపీ హైకోర్టు ఆదేశం
అమరావతి : సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేసిన పిటిషన్‌లో సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందరరెడ్డి అరెస్టు అక్రమమనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని చెప్పింది. గంజాయి కేసులో సౌందరరెడ్డిని పోలీసులు ఇరికించారని పేర్కొంది. పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో మరో తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారెంట్ లేకుండా అరెస్టు చేశారని ఆక్షేపించింది. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను అమలు చేయలేదని తప్పుపట్టింది. అందుకే ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. సౌందరరెడ్డిని ఈ నెల 22వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో అరెస్టు చేశామని రిమాండ్ రిపోర్టులో ఉందని, అదే రిపోర్టులో 7:30 గంటలకు మధ్యవర్తుల నివేదిక సిద్ధం చేశామని ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
రెడ్డి ఫోన్ తాడేపల్లి ప్రాంతంలో సాయంత్రం 6:21 గంటలకు స్విచ్ఛాఫ్ అయినట్లుగా ఫోన్ కంపెనీ చెప్పిందని తెలిపింది. అంటే అప్పటికే రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అర్థమవుతోందని హైకోర్టు పేర్కొంది. అదేరోజు రాత్రి 7 గంటలకు ఆయన భార్య లక్ష్మీప్రసన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయకుండా జనరల్ డైరీలో రికార్డు చేశారని కూడా గుర్తించింది. సౌందరరెడ్డి స్వేచ్ఛకు విఘాతం కలిగించారని, పోలీసులు విశ్వసనీయతపై తమకు ప్రాథమిక అనుమానాలున్నాయని చెప్పింది. కావున ఈ కేసును సిబిఐతో దర్యాప్తు చేయించడం సముచితమని చెప్పింది. ఇందులో ఏపీ సీబీఐ విభాగాధిపతిని ప్రతివాదిగా చేర్చుతున్నట్టు ప్రకటించింది. దీనిపై దర్యాప్తు జరిపి ప్రాథమిక నివేదిక సమర్పించాలని సిబిఐని ఆదేశించింది. సీతీఐ నుంచి ప్రాథమిక నివేదిక ఇచ్చేంత వరకు సౌందరరెడ్డిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. విచారణను అక్టోబరు 13కు వాయిదా వేసింది. తన భర్త సౌందరరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ కుంచాల లక్ష్మీప్రసన్న వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ రఘునందన్‌రావు ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
‘సోషల్ మీడియా పోస్టు’ ఆధారంగా పోలీసుల తప్పుపై తప్పు
- Advertisement -
- Advertisement -