Tuesday, September 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసంస్కరణలతో పోలీసుల పనితీరు మరింత మెరుగు

సంస్కరణలతో పోలీసుల పనితీరు మరింత మెరుగు

- Advertisement -

డీజీపీ జితేందర్‌
సంస్కరణలపై ఐపీఎఫ్‌తో రాష్ట్ర పోలీసు శాఖ ఒప్పందం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌

పోలీసుశాఖలో ప్రజోపయోగమైన సంస్కరణలతో మరింత విలువైన సేవలను అందించగలుగుతామని రాష్ట్ర డీజీపీ జితేందర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌(ఐపీఎఫ్‌)తో ఒప్పంద పత్రంపై డీజీపీ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల అదుపు విషయంలో అనేక విజయాలను పోలీసులు సాధిస్తున్నప్పటికీ ప్రజల అభిమతానికి తగిన విధంగా మార్పులు రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈలోటును పూడ్చడానికి ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌ సంస్థ అధ్యయనంతో అందిస్తున్న సంస్కరణలను అమలు చేయడం ద్వారా ఆ మార్పులను మరింత వేగవంతంగా చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ఐపీఎఫ్‌లో రిటైర్డ్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో పాటు మేధావులు, సామాజికవేత్తలు, ఇతర ప్రముఖులు ఉంటారని తెలిపారు. వారి మేధోమధనం ద్వారా సంస్కరణల పర్వానికి శ్రీకారం చుడతామన్నారు. ఐపీఎఫ్‌ అధ్యక్షులు, కేంద్ర పారామిటరీ బలగాల మాజీ డైరెక్టర్‌ ఓం ప్రకాశ్‌ మాట్లాడుతూ…పోలీసు శాఖలో తీసుకోవాల్సిన సంస్కరణలపై అధ్యయనాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పంజాబ్‌, కేరళ, తమిళనాడు, తదితర రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా సంస్కరణలను అమలు చేస్తున్నామని చెప్పారు.

అందులో భాగంగా తెలంగాణలో సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 15, సంగారెడ్డి జిల్లాలో 15 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈ సంస్కరణలను ప్రయోగాత్మకంగా చేపడుతున్నామని తెలిపారు.
అందుకు తగిన విధంగా ఆయా పీఎస్‌ల సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఐపీఎఫ్‌ దక్షిణ రాష్ట్రాల సీఈఓ, రాష్ట్ర విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మాజీ డీజీపీ డాక్టర్‌ ఈష్‌కుమార్‌ మాట్లాడుతూ..పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తూ వారి సమస్యలను సావధానం విని, క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేకూర్చడం వల్ల సమాజంలో శాంతి భద్రతలు మరింత పరిపుష్టం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐపీఎఫ్‌ సభ్యురాలు, రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోడైరెక్టర్‌ శిఖాగోయెల్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -