Tuesday, July 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతక్షణమే పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలి

తక్షణమే పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలి

- Advertisement -

– విద్యార్థుల గందరగోళానికి పరిష్కారం చూపాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా కార్యదర్శి అశోక్‌
– స్టేట్‌ టెక్నికల్‌ బోర్డు ఆఫీస్‌ ఎదుట ధర్నా
– రెండ్రోజుల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ :బోర్డు కార్యదర్శి హామీ
నవతెలంగాణ-సిటీబ్యూరో

వెంటనే పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి కాలేజీల్లో సీట్లు కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి కె.అశోక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష(పాలిసెట్‌) 22 వేల మంది విద్యార్థులు రాశారని, ఈ నెల 4 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉండగా అధికారులు ఇప్పటి వరకు నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర సాంకేతిక విద్య మండలి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు లెనిన్‌ గువేరా అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. టెక్నికల్‌ బోర్డు అనేక కారణాలు చెబుతూ కౌన్సెలింగ్‌ ప్రక్రియను వాయిదా వేసిందని తెలిపారు. కళాశాలలు భారీగా ఫీజులు పెంచాయనే పేరుతో వాయిదా వేసిన అధికారులు కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదన్నారు. హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే స్పందించట్లేదని, పేద విద్యార్థులను అయోమయంలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థుల ధర్నా దగ్గరకు వచ్చిన బోర్డు కార్యదర్శి పుల్లయ్య వినతిపత్రం తీసుకున్నారు. విద్యార్థి నాయకులతో చర్చించారు. రెండ్రోజుల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపడతామని, ఫీజులపై స్పష్టత లేనందున ఆలస్యం అయ్యిందని, ప్రభుత్వంతో చర్చించామని తెలిపారు. స్పష్టమైన హామీ ఇవ్వాలని, ఆలస్యం లేకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కౌన్సెలింగ్‌ ఒక్కటి రెండ్రోజుల్లో నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా నాయకులు రజనీకాంత్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -