Monday, October 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపోలియో వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ విజయవంతం

పోలియో వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ విజయవంతం

- Advertisement -

నేడు, రేపు మిగిలిన పిల్లల ఇంటింటికి సిబ్బంది
16,35,432 మందికి పోలియో వ్యాక్సిన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో తలపెట్టిన పోలియో వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ విజయవంతమైంది. పొరుగు దేశాల్లో పోలియో కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మన దేశంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన దేశంలోకి వివిధ దేశాల నుంచి ఎక్కువగా రవాణా ఉన్న 270 జిల్లాలను స్పెషల్‌ డ్రైవ్‌ కోసం గుర్తించింది. ఇందులో మన రాష్ట్రంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, హన్మకొండ, సంగారెడ్డి ఉన్నాయి. దీనికి తోడు వరంగల్‌ జిల్లా పట్టణ ప్రాంతంలోనూ స్పెషల్‌ డ్రైవ్‌లో పిల్లలకు వ్యాక్సిన్‌ వేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. దీంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆరు జిల్లాల పరిధిలో 16,35,432 మంది పిల్లలకు 6,897 బూత్‌ల ద్వారా పోలియో చుక్కలను వేశారు. ఐదేండ్లలోపు చిన్నారలందరికి పోలియో చుక్కలను వేశారు. స్పెషల్‌ డ్రైవ్‌ సందర్భంగా బూత్‌లకు రాని పిల్లల కోసం ఈ నెల 13, 14 (సోమ, మంగళవారాలు) తేదీల్లో ఆరోగ్య సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతంలో ఇంటింటికి తిరగనున్నారు.

హైదరాబాద్‌ జిల్లాలో 15న కూడా ఇండ్లను సందర్శించి పోలియో చుక్కలను వేయనున్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ కోసం ఆరు జిల్లాల్లో 59 మొబైల్‌ టీమ్స్‌, 138 ట్రాన్సిట్‌ పాయింట్స్‌ను ఏర్పాటు చేశారు. 576 రూట్‌ సూపర్‌ వైజర్లు పర్యవేక్షించారు. వ్యాక్సినేషన్‌లో 9,110 మంది మహిళా ఆరోగ్య కార్యకర్తలు (ఎంపీహెచ్‌ఏ (ఎఫ్‌ )) 6,705 ఆశా కార్యకర్తలు, 6,574 అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యాక్సినేషన్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 19,10,400 డోసులను ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉంచారు. అవసరమైన మహిళా మండలి, మెప్మా గ్రూప్‌, సెర్ప్‌ గ్రూప్‌ సభ్యులు, నర్సింగ్‌, పారా మెడికల్‌ విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులను భాగస్వాములు చేశారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరు జిల్లాల్లో బ్యానర్లు, వీడియో క్లిప్స్‌ ద్వారా ప్రచారం నిర్వహించారు.

పోలియో చుక్కలు వేయించాలి : డాక్టర్‌ సంగీత సత్యనారాయణ
ఐదేండ్లలోపు చిన్నారులందరికి పోలియో చుక్కలను వేయించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్‌ వెస్ట్‌ మారెడ్‌పల్లిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఆమె చిన్నారులకు పోలియో చుక్కలు వేసి స్పెషల్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు. దాదాపు 60 మంది చిన్నారులు ఈ బూత్‌లో పోలియో చుక్కల మందు వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటి, చిల్డ్రన్‌ ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రాం జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధీర తదితరులు పాల్గొన్నారు.

మొబైల్‌ టీమ్స్‌తో అందరికి పోలియో చుక్కలు: డీహెచ్‌ డాక్టర్‌ రవీంద్ర నాయక్‌
పోలియో బూత్‌లు, ఇండ్లలో పోలియో చుక్కల పంపిణీతోనే స్పెషల్‌ డ్రైవ్‌ అయిపోదని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ రవీంద్ర నాయక్‌ తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన స్పెషల్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్‌లకు రాకుండా, ఇండ్లలో కూడా లేని పిల్లల కోసం మొబైల్‌ టీమ్స్‌ ద్వారా గుర్తించి పోలియో చుక్కలను వేయిస్తామని తెలిపారు. బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్‌ పోర్ట్‌ తదితర అనేక కూడళ్ల వద్ద పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. భవన నిర్మాణ ప్రాంతంలో, ఇసుక బట్టీల ప్రాంతంలో కార్మికుల పిల్లలకు కూడా పోలియో వ్యాక్సినేషన్‌ చేస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 4,20, 911 మంది చిన్నారులకు పోలియో చుక్క లు వేయడానికి పట్టణ ప్రాంతంలో 422, గ్రామీణ ప్రాంతంలో 1,129 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 155 మంది రూట్‌ సూపర్‌ వైజర్లు, 6,204 మంది బూత్‌ టీమ్‌ మెంబర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలు చోట్ల ప్రజా ప్రతినిధులు, స్థానిక సంస్థల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -