మరోసారి కుప్పకూలిన ప్రభుత్వం
ఊపందుకుంటున్న బ్లాక్ ఎవ్రిథింగ్ ఉద్యమం
పారిస్ : ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం తీవ్రతరమవుతోంది. ప్రధాని ఫ్రాంకోయిస్ బేరే తన పదవికి రాజీనామా చేశారు. ఫ్రాంకోయిస్ ప్రభుత్వంపై చట్టసభలో సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గెలుపొందడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో దేశాధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ కేవలం 12 నెలల వ్యవధిలోనే నాలుగో ప్రధానిని నియమించాల్సి వచ్చింది. రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను ఫ్రాన్స్ తాజా ప్రధానిగా నియమితులయ్యారు. మరోవైపు ఫ్రాన్స్‌లో ‘బ్లాక్ ఎవ్రిథింగ్’ (ప్రతిదీ బ్లాక్ చేయి) పేరిట మొదలైన నిరసనోద్యమం ఊపందుకుంటోంది. వాస్తవానికి ఈ ఉద్యమానికి గత సంవత్స రమే అంకురార్పణ జరిగింది. దేశంలో ఎన్నికలు నిర్వహించాలని మాక్రాన్ తీసుకున్న నిర్ణయం ప్రజాగ్రహానికి కారణమైంది. రాజధాని పారిస్ సహా పలు నగరాలలో ప్రజలు రోడ్లను దిగ్బంధించి తన నిరసన తెలిపారు. వాహనాలు, నివాస గృహాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. మాక్రాన్‌పై ఒత్తిడి తేవడికి నిరసనకారులు పోలీసులపైనే తిరగబడుతున్నారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. బస్సులను కూడా తగలబెట్టారు. రైళ్లను నిలిపివేశారు. విద్యుత్ లైన్లను ధ్వంసం చేశారు. సోషల్ మీడియా, ఎన్‌క్రిప్టెడ్ ఛాట్‌ల ద్వారా వ్యాప్తి చెందుతున్న ఈ నిరసనలకు ప్రస్తుతానికి ఎవరూ నాయకత్వం వహించడం లేదు. ఎక్కడికక్కడ ప్రజలే ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం ఏకంగా 80 వేల మంది పోలీసులను మోహరించినప్పటికీ నిరసనలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. నూతన ప్రధానిని నియమించినప్పటికీ ఆందోళనలు చల్లారడం లేదు. బడ్జెట్ కోతలపై ప్రజాగ్రహం మిన్నుముడుతోంది. దేశశవ్యాప్తంగా 300 మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.