Tuesday, September 30, 2025
E-PAPER
Homeఆటలుపొలిటికల్‌ గేమ్‌!

పొలిటికల్‌ గేమ్‌!

- Advertisement -

ఆసియా కప్‌ ట్రోఫీ ప్రదాన వేడుక వివాదాస్పదం
నక్వీ చేతుల మీదుగా స్వీకరణకు సూర్యసేన నిరాకరణ
ప్రపంచ క్రికెట్‌ మునుపెన్నడూ చూడని అరుదైన ఘటన

క్రికెట్‌ను జెంటిల్‌మెన్‌ గేమ్‌గా అభివర్ణిస్తారు. ఆదివారం దుబాయ్ లో భారత్‌, పాకిస్తాన్‌ ఆసియా కప్‌ ఫైనల్‌ అనంతరం ట్రోఫీ ప్రదాన వేడుక తతంగం చూసిన వారు క్రికెట్‌ను జెంటిల్‌మెన్‌ ఆటగా ఏమాత్రం అంగీకరించరు. దౌత్య పరంగా ఫలించని దోస్తీని ఆటలతో అందిపుచ్చుకోవాలి. కానీ భారత్‌, పాకిస్తాన్‌ అంశంలో ఆటలు వైరానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. క్రికెట్‌లో పొలిటికల్‌ గేమ్‌ ఇరు దేశాలకు ఇటువంటి వాతావరణం ఏమాత్రం మేలు చేయదు.

నవతెలంగాణ-దుబాయ్
అర్థరాత్రి హైడ్రామా
ఆసియా కప్‌ 2025 ఫైనల్‌ అనంతరం మునుపెన్నడూ చూడని హైడ్రామా నడిచింది. ఉత్కంఠభరిత ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్‌.. రికార్డు స్థాయిలో 9వ సారి సొంతం చేసుకుంది. టీమ్‌ ఇండియా విజయ సంబురాల్లో మునిగిపోగా.. పాకిస్తాన్‌ క్రికెటర్లు గ్రౌండ్‌ను వదిలి డ్రెస్సింగ్‌రూమ్‌కు చేరారు. సాధారణంగా మ్యాచ్‌ ముగిసిన 30 నిమిషాల్లోపు బహుమతి ప్రదానోత్సవం ఆరంభం అవుతుంది. ఆదివారం దుబాయ్ లో అందుకు భిన్నంగా జరిగింది. పాకిస్తాన్‌ క్రికెటర్లు డ్రెస్సింగ్‌రూమ్‌ నుంచి బయటకు రాలేదు. ముగింపు వేడుకల ఏర్పాట్లు మైదానంలో ముందుకు సాగలేదు.
ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడు మోషిన్‌ నక్వీ. ఇతడు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మెన్‌గా కొనసాగుతూ.. ఆ దేశ ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్నారు. పొరుగు దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత క్షీణ దశకు చేరిన వేళ.. పాక్‌ మంత్రి నుంచి ఆసియా కప్‌ టైటిల్‌ స్వీకరించమని భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏసీసీ అధికారులకు సమాచారం అందించారు.

మరోవైపు ఏసీసీ అధ్యక్షుడి హోదాలో విజేతలకు ట్రోఫీ, నగదు బహుమతి సహా వ్యక్తిగత మెడల్స్‌ నేనే అందిస్తానని మోషిన్‌ నక్వీ పట్టుబట్టాడు. ప్రోటోకాల్‌ ప్రకారం నక్వీకి ఆ అధికారం ఉన్నప్పటికీ.. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోలేదు. యుఏఈ, శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరు ట్రోఫీ అందించినా స్వీకరించేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది. కానీ నక్వీ అందుకు సమ్మతించలేదు. ఇదే సమయంలో భారత్‌ సైతం ససేమిరా అనేసింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత గంటకు పైగా అభిమానులు స్టేడియంలో నిరీక్షించారు. ఆఖరుకు నక్వీ, ఇతర ఏసీసీ ప్రతినిధులు పాక్‌ క్రికెటర్లకు నగదు బహుమతి అందించారు. భారత క్రికెటర్లు అభిషేక్‌ శర్మ, కుల్‌దీప్‌ యాదవ్‌లు మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారాలను అందుకున్నారు. ఈ సమయంలో వేదికపై నక్వీ ఉన్నప్పటికీ.. అతడితో కరచాలనం చేయలేదు, అతడి వైపు కన్నెత్తి చూడలేదు. పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ప్రైజ్‌మనీ చెక్‌ అందుకోగానే.. వ్యాఖ్యాత సైమన్‌ డల్‌ ముగింపు వేడుక ముగిసిందని వెల్లడించాడు. భారత్‌ ఈ రోజు ట్రోఫీ, మెడల్స్‌ తీసుకోవటం లేదని ఏసీసీకి సమాచారం ఇచ్చారని తెలిపాడు.

మా ట్రోఫీ మాకివ్వాలె
భారత క్రికెటర్లు ఆసియా కప్‌ ట్రోఫీ, మెడల్స్‌ నిరాకరించటంతో… ఏసీసీ ప్రెసిడెంట్‌ మోషిన్‌ నక్వీ మరింత దిగజారాడు!. ఆసియా కప్‌ ట్రోఫీని గ్రౌండ్‌ నుంచి నేరుగా హోటల్‌లో తన గదికి పంపించాడు. వ్యక్తిగత మెడల్స్‌ను సైతం తనతో పాటు హోటల్‌ రూమ్‌కు పట్టుకెళ్లాడు. భారత్‌ ట్రోఫీ నక్వీ నుంచి స్వీకరణకే నిరాకరించింది కానీ టైటిల్‌ను కాదు. ఎవరు చేతుల మీదుగా కాకపోయినా.. డ్రెస్సింగ్‌రూమ్‌లో అధికారులు అందించినా సరిపోయేది. కానీ నక్వీ ఆ పని చేయలేదు. వివాదం మరింత ముదిరేలా వ్యవహరించాడు. నక్వీ చర్యలను కెప్టెన్‌ సూర్యకుమార్‌, బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్‌ సైకియా తప్పుబట్టారు. ‘ఆసియా కప్‌ ట్రోఫీ భారత్‌ హక్కు. టైటిల్‌, మెడల్స్‌ వీలైనంత త్వరగా భారత్‌కు చేరుకోవాలి’ అని ఏసీసీతో సైకియా అన్నాడు. నక్వీ వ్యవహారంపై నవంబర్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో లేవనెత్తుతామని, అవసరమైతే ఏసీసీ అధ్యక్ష పీఠం నుంచి దింపుతామని బోర్డు వర్గాలు అంటున్నాయి.

కరచాలనంతో మొదలై..!
ఆసియా కప్‌ ఆరంభం ముంగిట జరిగిన కెప్టెన్ల సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడు మోషిన్‌ నక్వీతో సూర్యకుమార్‌ యాదవ్‌ కరచాలనం చేశాడు. ఒకే టేబుల్‌పై కూర్చుని అతడితో భోజనం సైతం చేశాడు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. కెప్టెన్ల సమావేశంలో సూర్య కరచాలనం ఇవ్వటం సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌కు కారణమైంది. దీంతో భారత జట్టు, బీసీసీఐ టోర్నీలో పాక్‌ క్రికెటర్లతో కరచాలనం ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నాయి. పాక్‌తో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఇరు జట్ల క్రికెటర్లు కరచాలనం చేసుకోలేదు. ప్రపంచ క్రికెట్‌లో ఇదీ ఓ అరుదైన ఘటనే అని చెప్పాలి. తొలి మ్యాచ్‌ సాఫీగానే సాగినా.. సూపర్‌4లో ఉద్రిక్తతలు ముదిరాయి. ఫైనల్లో వివాదం ముదిరి పాకాన పడింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో ఆడటంపై స్వదేశంలో విమర్శలు వచ్చాయి. ఆసియా కప్‌ను భారత క్రికెట్‌ బోర్డే యుఏఈలో నిర్వహించింది. అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాజకీయ ప్రేరేపిత అంశాలు ముడిపడగా జెంటిల్‌మెన్‌ గేమ్‌ కాస్త పొలిటికల్‌ గేమ్‌గా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -