Tuesday, January 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాజకీయ వేధింపులే కాంగ్రెస్‌ ఎజెండా

రాజకీయ వేధింపులే కాంగ్రెస్‌ ఎజెండా

- Advertisement -

బొగ్గు కుంభకోణం దృష్టి మరల్చేందుకే హరీశ్‌రావుకు నోటీసులు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాజకీయ వేధింపులే కాంగ్రెస్‌ పార్టీ ఏకైక ఎజెండాగా మారిపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎలాంటి పస లేదనీ, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసిందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా, మళ్లీ హరీశ్‌రావుకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఎంత దిగజారిందో అర్థమవుతోందని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి బామ్మర్ది సుజన్‌రెడ్డికి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే, దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ‘డైవర్షన్‌ పాలిటిక్స్‌’ తప్ప మరొకటి కాదని తెలిపారు. హరీశ్‌రావు తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడని పేర్కొన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడటంలో కానీ ఆయన చూపిస్తున్న చొరవను చూసి రేవంత్‌ రెడ్డికి వణుకు పుడుతోందని తెలిపారు. అందుకే రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోలేక, ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. గత 24 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, ఈ దారుణమైన పాలనను నిలదీస్తున్నందుకే హరీశ్‌రావును లక్ష్యంగా చేస్తూ ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తమకు చట్టంపైన, న్యాయస్థానాలపైన పూర్తి గౌరవం ఉందనీ, అందుకే ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కానీ విచారణల పేరుతో, నోటీసులతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తే అది భ్రమ మాత్రమేననీ, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులకు గురిచేసినా ప్రజల పక్షాన వేటాడటం ఆపేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామనీ, అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. ఇలాంటి చౌకబారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

హరీశ్‌రావుకు నోటీసులు అభ్యంతరకరం : ఎంపీ వద్దిరాజు
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు దేశ అత్యున్నత న్యాయస్థానం క్లీన్‌చిట్‌ ఇస్తూ తీర్పు చెప్పిందని బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు రావాలంటూ హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేయడం తీవ్ర అభ్యంతరకరమని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నదని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -