Tuesday, January 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకుబేరుల చేతుల్లోనే రాజకీయ అధికారం..

కుబేరుల చేతుల్లోనే రాజకీయ అధికారం..

- Advertisement -

– మీడియాలోనూ వారిదే ఆధిపత్యం
– సోషల్‌ మీడియా వేదికలూ వారివే
– పెరుగుతోన్న తీవ్ర అసమానతలు : ఆక్స్‌ఫామ్‌ సంచలన రిపోర్ట్‌
నవతెలంగాణ – బిజినెస్‌ డెస్క్‌

ప్రపంచ కుబేరుల చేతుల్లోనే నేటి రాజకీయ అధికారం ఉందని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా వేదికలు కూడా బడాపెట్టుబడిదారి వర్గాల వద్దనే ఉన్నాయని వెల్లడించింది. సాధారణ పౌరులతో పోలిస్తే అత్యంత ధనవంతులు రాజకీయ అధికారాన్ని పొందే అవకాశం 4,000 రెట్లు ఎక్కువగా ఉందని విశ్లేషించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సు ప్రారంభమైన సందర్భంగా ఆక్స్‌ఫామ్‌ ఈ సంచలన నివేదికను విడుదల చేసింది.
పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ఆక్స్‌ఫామ్‌ తన వార్షిక నివేదికలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బిలియనీర్లు కేవలం సంపదను పోగు చేసుకోవడమే కాకుండా.. రాజకీయాలు, ప్రధాన స్రవంతి మీడియా, సోషల్‌ మీడియాపై కూడా తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంటున్నారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. ఉన్నవారికి, లేనివారికి మధ్య అగాధం మరింత పెరిగిందని స్పష్టం చేసింది.

సమాచార వ్యవస్థపై పట్టు..
కుబేరులు పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియా తదితర సమాచార మార్పిడి సాధనాలపై పూర్తి నియంత్రణ సాధిస్తున్నారని ఆక్స్‌ఫామ్‌ విమర్శించింది. దీనికి ఉదాహరణలుగా కొన్ని కీలక పరిణామాలను గుర్తు చేసింది. అమెజాన్‌ అధిపతి ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రికను కొనుగోలు చేయడం, ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకోవడం, బయోటెక్‌ బిలియనీర్‌ ప్యాట్రిక్‌ సూన్‌-షియోంగ్‌ ‘లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌’ను సొంతం చేసుకున్నారు. భారత్‌లోనూ అదానీ, అంబానీల చేతుల్లో ప్రధాన మీడియా సంస్థలు ఉన్న విషయం తెలిసిందే.
”కుబేరులకు రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, మీడియాపై ఉన్న అపరిమిత ప్రభావం వల్ల అసమానతలు పెరిగి, పేదరిక నిర్మూలన లక్ష్యాలు పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వాలు సంపన్నుల ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యం, వాతావరణ మార్పులు, పన్నుల న్యాయంపై దృష్టి సారించాలి.’ అని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అమితాబ్‌ బెహర్‌ అన్నారు.

ఎన్నికలను కొనేస్తున్నారు..!
ఆక్స్‌ఫామ్‌ నివేదికలోని ముఖ్యాంశాలు.. 2025లో బిలియనీర్ల ఉమ్మడి సంపద 2.5 ట్రిలియన్‌ డాలర్ల (రూ.225 లక్షల కోట్లు)మేర పెరిగింది. ఇది ప్రపంచ జనాభాలోని దిగువ సగభాగం (సుమారు 4.1 బిలియన్ల మంది) వద్ద ఉన్న మొత్తం సంపదతో సమానం కావడం గమనార్హం. గతేడాది ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల (రూ.9వేల కోట్ల ఆస్తులు) సంఖ్య మొదటిసారి 3,000 మార్కును దాటింది. ప్రపంచ కుబేరుడు ఇలాన్‌ మస్క్‌ సంపద అర ట్రిలియన్‌ డాలర్లకు (500 బిలియన్లు) చేరుకోవడం ఇదే మొదటిసారి. భారత కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.45 లక్షల కోట్లు. దగ్గర దగ్గర భారత బడ్జెట్‌ అంత కావడం ఆందోళకరం. సాధారణ ప్రజలతో పోలిస్తే బిలియనీర్లు రాజకీయ పదవుల్లోకి వచ్చే అవకాశం 4,000 రెట్లు ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో.. ధనవంతులు ఎన్నికలను కొనేస్తున్నారని, ప్రభావితం చేస్తున్నారని సగం మంది పైగా ప్రజలు నమ్ముతున్నారు.

పెరుగుతున్న అణచివేతలు..
పెరుగుతున్న ధరలు, జీవన ప్రమాణాలు పడిపోవడంతో ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆక్స్‌ఫామ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. 2025లో 68 దేశాల్లో దాదాపు 142 ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగాయని పేర్కొంది. వీటిని ప్రభుత్వాలు బలప్రయోగంతో అణచివేస్తున్నాయని వెల్లడించింది. ధనిక వర్గాలను కాపాడటం కోసం సామాన్యుల హక్కులను కాలరాస్తున్నా రని విమర్శించింది. ఈ ఏడాది దావోస్‌ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ వంటి ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు సుమారు 850 మంది బడా కంపెనీల సీఈఓలు పాల్గొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -