దళిత, ఆదివాసీ కులాల్లోని యువత సామాజిక ఎరుకతో అస్తిత్వగొంతుతో రచనలు చేస్తున్న గొప్ప సాహితీ కారుడు కే.పీ.లక్ష్మీనర్సింహ. నర్సింహ పాలమూరు జాంబవ జాతి రైతుబిడ్డ. గొడ్లగాసుడే లోకంగా పెరిగిన గూడెం బిడ్డ. నర్సింహ విషయంలో ప్రత్యేకమైన అరుదైన గొప్ప విషయం ఏంటంటే అందరు చదువుల నుంచి డ్రాపవుట్ అయితే, నరింహ పద మూడేండ్ల వయసులో గొడ్లకాపరి నుంచి డ్రాపవుట్ అయ్యి అక్షరాలు కాసే చదువుకు ఎగబాకి ఉన్నతచదువులతో ఎంతో యెత్తుకెదిగిన సాహితీవేత్తగా మారడం అద్భుతం.
2019లో కూడలిలో జరిగిన బహుజన కథా కచ్చీరులో అల్లనేరేడు పండోలె అందమైన ఒక చిన్నతమ్ముడు ‘చెప్పుల సాయమ్మ’ కథ వినిపించినప్పుడు ఫుల్లు ఫిదా ఐపోయింది బహుజన కథా కచ్చిరు. చెప్పులు చేసి అమ్ముకొని బతికే సాయమ్మ జీవిక వత్తిని దెబ్బతీసి ఆమెను యాచక వత్తికి నెట్టేసిన పెద్ద పెద్ద చెప్పుల కంపెనీల ప్రపంచీకరణను బహుజన కథా కచ్చీరులో కళ్లకు కట్టిండు నర్శింహ. ఇంత చిన్నతనంలో ఎంత గొప్ప అస్తిత్వ సామాజిక సాహితీ చైతన్యం అని ఆశ్చర్యపోయిన. ఇరవై ఏళ్లకే రైతుల మీద ‘కుట్ర చేస్తున్న కాలం’తో కవిత్వమైన కవిగా మొదలయిండు నర్సింహ. పాతికేండ్లకే మూడు కవితా సంపుటీలు, నానీల కవిత్వం ‘అంబలి గంప’ కథలు మొత్తం ఆరు పుస్తకాలను వెలువరించడం గొప్ప సంగతి. నలభైయేండ్ల దాకా రాయడమే గానీ వొక్క పుస్తకం తేలేని నాలాంటోల్లకు కేపీ లక్ష్మీనర్సింహ ఆదర్శ సాహితీ వేత్త. గొడ్ల కాపరి నుంచి చదువు యుద్ధం, బతుకు యుద్ధం, అంటరాని కుల వివక్షల యుధ్ధంపై, కులం పోరీలతో కులాంతర ప్రేమ యుద్ధాలు, వూరి దొరల దౌర్జన్యరాజకీయ యుద్ధాల నుంచి సాహిత్యాన్ని సంధించడం చిన్న విషయం గాదు. ఇప్పుడు నర్శింహ వేస్తున్న మరో కథల సంపుటి ‘నీ దగ్గర గాజులు కొనని రోజు’. ఈ కథల సంపుటిలో కొన్ని గ్రామ దొరల కులదౌర్జన్య రాజకీయాల కథలు ఉంటే, మిగతా కథలన్నీ కులాంతర ప్రేమల్లో, కులాంతర పెళ్లి కథల్లో కుల రాజకీయాల క్రూరత్వాన్ని తోలొల్సినట్టుగా చెప్పాడు. ఈ కథల్లో ‘అతనేమి నన్ను ఇష్టపడలేదు, నేనే అతన్ని ఇష్టపడిన’ అన్నట్లుగానే ఉంటాయి పై కులాల అమ్మాయిలకు కింద కులాల అబ్బాయిలకు మధ్యనుండే ప్రేమ సంబంధాలు. కులాంతర ప్రేమల్లో ఆడైనా మగైనా ఆధిపత్య కులాలే అడ్వాన్స్ అయిన ఆక్రమణలు ఉంటయనే నిజాన్ని స్పష్టంగా ఈ రచయిత ప్రేమ కథలన్నింటిలో బొమ్మ కట్టిండు. మామూలుగా అంటరాని కులాల అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ పై కులాలతో ప్రేమ సంబంధాల్లో తామంత తామే ముందుపడరు. పడితే తర్వాత జరిగే ప్రాణాలు పోయే పరిణామాలకు బలి కాలేక దూరముంటారు. హెచ్చుతగ్గుల కుల సమాజంలో ప్రేమకు కూడా కులం ఉంటదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆదిపత్య కులప్రేమ డామినెంట్‌గా ఉంటే, అణగారిన కులాల ప్రేమలు లొంగుబాటుగా ఉంటయి.
ఈ కథా సంపుటిలో జమీందారు బిడ్డ కథలో ఎస్సీ కులపు అబ్బాయిని దొరబిడ్డ జొన్న చేనులకు తోలుకపొతే, దొరబిడ్డ ఒక్కతే బయటకు వస్తది. ఎస్సీ అబ్బాయి జొన్న చేండ్ల శవమైపొయిన కథ వేల కంచికచర్ల కోటేషులు కండ్లల్ల మెదులుతరు. కులాంతర ప్రేమలో చంపబడుతున్న ఎందరెందరో దళిత యువకుల విషాద యాదులు వేధిస్తయి. తనను ప్రేమించిన పిల్ల దొర్సానులను దక్కించుకునే ధైర్య సాహసాలు చేయలేడు. ఎందుకంటే దొరలు తననే కాకుండా తన కుటుంబాన్ని బూడిద చేస్తున్న ఘటనలు కళ్ళముందు కోకొల్లలు. అందుకేనేమో కింది కులాల అబ్బాయిలు పై కులాల అమ్మాయిల్ని ప్రేమించడంలో ముందుబడరు. నిన్ను చంపి నేను చెప్తా అనే బెదిరింపులు, ఆసిడ్ దాడులు, దౌర్జన్యాలు ఉండయి. ‘నీ దగ్గర గాజులు కొనని రోజున’ కథలో ఇదే జరుగుతుంది. పై కులం శిరీష ఎస్సీ కులమ్ విజరు ప్రేమించుకుంటే.. ‘ఆ కులం తక్కువోన్ని చేసుకుంటవా, పిల్లగాడు మంచోడే కావచ్చు కానీ కులంతక్కువోడు బిడ్యా’ అనీ, సస్తనని బెదిరిస్తది శిరీష తల్లి. ‘నేను మనిషికి మనుంబోతలేను కులానికి మనుంబోతున్న, ప్రతి బోనాల పండుగకు నీవిచ్చే గాజుల కోసం వస్తా’ అని చెప్పి పెళ్లి చేసుకొని శిరీష వెళ్ళిపోతే, ప్రేమంతా గాజుల్ల నింపుకొని ప్రతి ఏడాది బోనాల పండుగై వచ్చే శిరీష కోసం ఎదురుచూసే అంటరాని విజరు అలివికాని ప్రేమ యెతనే ‘నీ దగ్గర గాజులు కొనని రోజున’ కథ.
ఈ కథల సంపుటిలో ‘మా వూరికి దొరొచ్చిండు, యువనాయకత్వం, వాయిదా’ వంటి రాజకీయ కథల్లో ఈ యువ రచయిత సామాజిక, రాజకీయ చైతన్య పరిణతి ఉన్నతి కనిపిస్తుంది. ప్రేమ కథలో ఏ కథకు ఆ కథనే ప్రత్యేకం. ఆ ప్రత్యేకంలో ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కథలు ‘సాక, జొన్న రొట్టెలు’. ‘సాక’ అంటే ఉత్తర తెలంగాణలో దేవర ముందట ఆరగించే బెల్లం నీళ్ళను, కల్లును సాక అంటరు. కానీ ఈ సంపుటిలోని ‘సాక’ కథ రెడ్లకు మాదిగలకు మధ్యనున్న సాంస్కతిక సంప్రదాయ కట్టడి. ఇది బయట ప్రపంచానికి తెలువది. రెడ్ల కులంలో పెండ్లికార్యంలో సాక తిప్పడానికి మాదిగ మగవాళ్ళను పిలవాలి. వాళ్లొచ్చి నేలమీద పటమేసి పెండ్లిపిల్ల మెడల మాదిగతను గవ్వల దండేసినంకనే, వారి వెనుక సాక పటం సుట్టు తిరిగినంకనే పెండ్లి పిలగాడు తాలికట్టాలే, ఏడడుగులు నడవాలి. ఈ సాంస్కతిక సమాజ సరళి మహబూబ్‌నగర్‌లో సజీవంగా ఇప్పటికీ వున్నదట. సాక కథలో రెడ్డి బిడ్డ గీత, మాదిగ రాకేష్‌ను ప్రేమిస్తే తండ్రి సహించడు. పరువు కోసం చంపైనా కులవిలువలు నిలబెట్టడాన్ని వ్యతిరేకించి, సాక సాంప్రదాయాన్ని వివరించి తండ్రిని నిలేసి మార్పు తీసుకొనివచ్చి మాదిగ రాకేష్‌ను అల్లునిగా చేసుకోడానికి ఆమోదింప చేస్తది. కానీ సమాజంలో పై కులం తండ్రులు అట్లా మారినట్టుగా చూడబోం. రచయిత పై కులాల తండ్రులు మారాలనే గొప్ప ఆదర్శంతో, ఆకాంక్షతో చిత్రించిన కథ ఇది.
చదువుకునే కింది కులాల ఆడపిల్లలు ఆత్మగౌరవంగా కుల చైతన్యంతో వుండగలిగితేనే బతికి బచాయిస్తరు. లేకుంటే ప్రేమ పేరుతో జరిగేవి బతుకులు బుగ్గిపాలే అని చెప్పి కింది కులాల ఆడ పిల్లలకు ఇమ్మతిచ్చిన కథ ‘జొన్న రొట్టెలు’. ఈ కథలో ఎమ్మెస్సీ చేసి, బిఈడి చేస్తున్న విజయలక్ష్మి ‘పెద్ద రౌడీ పిల్లరా, తేడా వస్తె బూతు డిక్షనరీ తెరుస్తది గా పిల్ల జోలికి పోకు’ అనే భయాలు బెట్టడం వల్లనే ప్రేమ ఎరకు గురికాకుండా ఉన్నత చదువుల్లో వుంటది.
ఈ కథా సంపుటిలో ‘జొన్నరొట్టె’ కథ తప్ప అమ్మాయిలంతా బీసీ ఒసీ కులాల వాల్లు. అబ్బాయిలంత ఎస్సీకులాల వాల్లు. వాటిలో కొన్ని ప్రేమలు అనేక సంఘర్షణలతో నిలబడితే, కొన్ని నిలువూత బొందలకు చేరే విషాదాలు. ఆడ మగ తమకు నచ్చిన వ్యక్తులతో జోడికట్టి కూడి బతుకుదాం అంటే కులం ఒప్పక వుప్పుపాతరేస్తున్న ఘటనలను, పరువు హత్యలు మనకండ్ల ముందటనే కంచికచర్ల కోటేషు కాన్నుంచి, ప్రణరు, మంతెన మధుకర్ లాంటివి బొచ్చడు జరుగు తున్నయి. ఈ కథలు చదువుతుంటే చంపబడ్డ బహుజన యువకుల, యువతుల విషాద గాధలన్ని గుండెను పిండుతయి. సమాజంలో కులాంతర ప్రేమలు పెళ్ళిళ్ళు వర్ధిల్లాలని, పరువు హత్యలు నశించాలని, ప్రేమ నేరం కాదని, అది గొప్ప మానవతా విలువని, కుల మత జెండర్ ఆధిపత్యాల్లేని, మనిషిని మనిషి ఆలింగనం చేసే స్వచ్ఛమైన మానవీయ స్వప్నాలను స్వాగతిస్తున్న ఈ యువరచయితకు సమాజం కూడా గొంతు కలిపే రోజొచ్చేది ఖాయం.
జూపాక సుభద్ర
ప్రేమైక రాజకీయ కథలు
- Advertisement -
- Advertisement -