Wednesday, December 31, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరాజకీయ పోరాటం...అధికారం కోసం ఆరాటం

రాజకీయ పోరాటం…అధికారం కోసం ఆరాటం

- Advertisement -

– ఇద్దరు మహిళల మధ్య నలిగిన బంగ్లాదేశ్‌
– అవినీతి ఆరోపణలతో మసకబారిన ప్రతిష్ట
ఢాకా :
నాలుగు దశాబ్దాల పాటు బంగ్లాదేశ్‌ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన ఇరువురు మహిళా నేతలలో ఒకరైన ఖలీదా జియా మంగళవారం మరణించగా మరో నేత షేక్‌ హసీనా ప్రస్తుతం మన దేశంలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. వీరిద్దరి మధ్య తీవ్రమైన, వ్యక్తిగత శతృత్వం కొనసాగింది. ఇరువురు మహిళల మధ్య పోరు రాజకీయాలకే పరిమితం కాలేదు.

అది ప్రభుత్వ సంస్థల్లోకి చొచ్చుకొని పోయింది. పరిపాలనను స్తంభింపజేసింది. వీధి పోరాటాలకు దారి తీసింది. ప్రజా స్వామిక రాజకీయాలను భ్రష్టు పట్టించింది. వీరిద్దరి మధ్య కొనసాగిన శతృత్వం అధికారం కోసమే కాదు…చరిత్ర, గుర్తింపు కోసం కూడా. ఆ పోరులో విజేతగా నిలిచిన వారు అధికారాన్ని చెలాయించగా పరాజితులు తరచుగా జైలు జీవితాన్ని గడిపారు.

అసాధారణ పరిస్థితుల్లో చేతులు కలిపిన విరోధులు
హసీనా, ఖలీదాల మధ్య తీవ్ర శత్రుత్వం ఉన్నప్పటికీ 1980వ దశకంలో వారిద్దరూ అసాధారణ పరిస్థితులలో చేతులు కలపాల్సి వచ్చింది. ఆ సమయంలో దేశ రాజకీయాలపై సైనిక పాలకుడు హుస్సేన్‌ మహమ్మద్‌ ఎర్షాద్‌ పట్టు బిగించారు.
1982లో జరిగిన కుట్రలో ఆయన అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దేశంలో సైనిక పాలన కొనసాగింది. ఆ దశాబ్దమంతా షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌, ఖలీదా జియా నాయకత్వంలోని బీఎన్‌పీలు సమాంతర నిరసన ఉద్యమాలు నడిపాయి. హర్తాళ్లు, వీధి పోరాటాలు, శాసనోల్లంఘనలతో పరిపాలన స్తంభించింది. మూకుమ్మడి అరెస్టులు, సెన్సార్‌షిప్‌, ఎమర్జెన్సీ చట్టాలతో ఎర్షాద్‌ ఉక్కుపాదం మోపినప్పటికీ ప్రజాగ్రహం చల్లారలేదు. ఎర్షాద్‌ను పదవీచ్యుతుడిని చేసే ఏకైక లక్ష్యంతో హసీనా, ఖలీదా చేతులు కలిపారు. వీరు ప్రారంభించిన ఆందోళన 1990లో తీవ్ర స్థాయికి చేరింది. విద్యార్థులు కూడా ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఎర్షాద్‌ 1990 డిసెంబర్‌ 6న పదవికి రాజీనామా చేశారు.

ప్రత్యర్థే లక్ష్యంగా..
ఇరువురు మహిళా నేతల మధ్య నెలకొన్న శతృత్వం కారణంగా 1990, 2000 దశకాలలో బంగ్లాదేశ్‌లో తరచూ ఎన్నికలు జరిగాయి. బహిష్కరణలతో పార్లమెంట్‌ సజావుగా నడిచిన దాఖలాలు లేవు. వీధులు పోరాటాలకు కేంద్రాలుగా మారాయి. సమ్మెలు, హర్తాళ్లు, నిరసన ప్రదర్శనలు జరిగిన ప్రతిసారీ వీధి పోరాటాలు తప్పనిసరి అయ్యేవి. ఖలీదా, హసీనా…ఇద్దరు మహిళల్లో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యర్థిని బలహీనపరచడానికి అధికార యంత్రాంగాన్ని వాడుకునే వారు. అవినీతి కేసులు, అరెస్టులు, పాలనాపరమైన ఒత్తిడులు నిత్యకృత్యమ య్యాయి. ప్రజాస్వామిక సంస్థలన్నీ బలహీన పడ్డాయి. ఎన్నికలపై ప్రజలకు విశ్వాసమే లేకుండా పోయింది. రాజకీయ అసహనం పెచ్చుమీరింది. తరచుగా ఆపద్ధర్మ ప్రభు త్వాలు ఏర్పడేవి. ఒకరి పాలన అంటే మరొకరికి గిట్టేది కాదు. ప్రత్యర్థి హయాంలో స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎలా ఎన్నికలు జరుగుతాయని నిందించుకునే వారు.

కుట్రలు…కుతంత్రాలు
1971లో స్వాతంత్య్రం పొందిన తర్వాత బంగ్లాదేశ్‌ది చాలా వరకూ రక్తచరిత్రే. పదవీచ్యుతురాలై ప్రస్తుతం మన దేశంలో తలదాచుకుంటున్న షేక్‌ హసీనా బంగ్లాదేశ్‌ విముక్తి కోసం పోరాడిన షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ కుమార్తె. ఆయన దేశానికి తొలి అధ్యక్షుడు. అయితే 1975లో జరిగిన సైనిక కుట్రలో హతమయ్యారు. ఆ సమయంలో ఆయన కుటుంబం చాలా వరకూ తుడిచిపెట్టుకొని పోయింది. హసీనా అనేక సంవత్సరాలు ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది. ఖలీదా జియా రాజకీయ జీవితంలో కూడా విషాదం తొంగిచూసింది. ముజిబుర్‌ హత్యానంతరం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆర్మీ జనరల్‌ జియావుర్‌ రెహ్మాన్‌ ఆమె భర్త. జియావుర్‌ రెహ్మాన్‌ 1981లో జరిగిన సైనిక కుట్రలో హత్యకు గురయ్యారు. అయితే ఆ కుట్ర విఫలమైంది. భర్త మరణంతో ఖలీదా రాజకీయ ప్రవేశం చేశారు. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) నాయకురాలయ్యారు.

ఎన్నికల వేళ కన్నుమూత
గత సంవత్సరం షేక్‌ హసీనా ప్రభుత్వం పతనమవడంతో ఖలీదా జియా మళ్లీ తెరపైకి వచ్చారు. హసీనా రాజీనామా చేసిన కొద్ది గంటలలోనే ఆమె గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె అన్ని అవినీతి కేసుల నుంచి బయటపడ్డారు. మేలో లండన్‌లో ప్రత్యేక వైద్య చికిత్స పొందారు. ఆ తర్వాత ఖలీదా కుమారుడు, ఆమె రాజకీయ వారసుడు తారిక్‌ రెహ్మాన్‌ స్వదేశంలో అడుగుపెట్టారు. ఏదేమైనా 80 సంవత్సరాల ఖలీదా జియా బంగ్లాదేశ్‌ రాజకీయాలలో అనేక దశాబ్దాల పాటు కీలకపాత్ర పోషించారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ఆమె మరణించడంతో దేశ రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.

కనుమరుగైన ఖలీదా
సైన్యం మద్దతుతో ఏర్పడిన ఆపద్ధర్మ ప్రభుత్వం 2007 సెప్టెంబరులో అత్యవసర పరిస్థితిని విధించి అవినీతి, దోపిడీ ఆరోపణలపై ఖలీదా, హసీనాలను అరెస్ట్‌ చేసింది. రాజకీయ, న్యాయపరమైన ఒత్తిడుల కారణంగా సంవత్సరం తర్వాత విడుదల చేసింది. 2011లో రాజ్యాంగ సవరణ ద్వారా హసీనా ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. దీనిని బీఎన్‌పీ వ్యతిరేకించింది. 2014, 2018లో జరిగిన ఎన్నికలలో బహిష్కరణలు చోటుచేసుకున్నాయి. 2010వ దశకం మధ్య నాటికి దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన నాయకురాలిగా షేక్‌ హసీనా రికార్డు సృష్టించారు. మరోవైపు ఖలీదా రాజకీయ అవకాశాలు అడుగంటిపోయాయి. అవినీతి కేసులలో శిక్ష పడిన ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. నిర్బంధాలు తప్పలేదు. దీంతో ఆమె క్రియాశీలక రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఒక వైపు దేశ రాజకీయాలలో అవామీలీగ్‌ పట్టు బిగిస్తుంటే మరోవైపు నాయకత్వం లేక బీఎన్‌పీ మనుగడ ప్రమాదంలో పడింది. బంగ్లాదేశ్‌ రాజకీయా లను శాసించిన ఈ ఇరువురు మహిళా నేతల మధ్య శతృత్వం ప్రజాస్వామ్యబద్ధమైన పోటీతో ముగియలేదు. ఘర్షణలు, సంస్థాగత ఆధిపత్యం ద్వారా అది చల్లారిపోయింది. 2018లో మరోసారి ఖలీదా జైలుకు వెళ్లారు. అవినీతి ఆరోపణలపై సుదీర్ఘ కాలం పాటు కారాగార శిక్ష అనుభవించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -