– రిజర్వేషన్, జనాభా ఓటర్ల సమీకరణలే కీలకం
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం మున్సిపాల్టీ ఎన్నికలకు సిద్ధమవుతుండటంతో, తొలిసారి ఎన్నికలు జరగనున్న అశ్వారావుపేట మున్సిపాల్టీ పై ఆశావాహుల ఎదురుచూపు పెరిగింది. ముఖ్యంగా చైర్మన్ పీఠం దక్కించుకోవాలనే ఆకాంక్షతో అగ్ర సామాజిక, ఆర్థిక సాధికారత కలిగిన వర్గాలు రాజకీయ సమీకరణాల్లో చురుగ్గా కదులుతున్నాయి. అయితే అశ్వారావుపేటకు రాజకీయంగా ఒక ప్రత్యేక నేపథ్యం ఉంది. పూర్వం పంచాయితి గా ఉన్న సమయంలో సీపీఐ(ఎం) జిల్లా నేత కొక్కెరపాటి పుల్లయ్య రెండు దఫాలు సర్పంచ్‌గా పని చేయడం ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్య రాజకీయాలకు బలమైన పునాది వేసింది. ఇప్పుడు మున్సిపాల్టీ గా మారడంతో అదే రాజకీయ వారసత్వం కొత్త రూపంలో పరీక్షకు నిలుస్తోంది.
తొలి ఎన్నికలు… రిజర్వేషన్ పై ఉత్కంఠ
మొదటి సారి మున్సిపాల్టీ ఎన్నికలు కావడంతో చైర్మన్ పదవి ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సామాజిక కుల జనాభా,ఓటర్ల నిష్పత్తి రాజకీయ వ్యూహాల్లో కీలకంగా మారాయి.
మున్సిపాల్టీ రూపకల్పన
1960లోనే పంచాయితి గా ఏర్పడిన అశ్వారావుపేట కు,1990 దశకంలో ఏర్పడిన పేరాయిగూడెం, 2018లో ఏర్పడిన గుర్రాల చెరువు పంచాయితి లను కలిపి 2024 జనవరిలో అశ్వారావుపేట మున్సిపాల్టీ గా రూపకల్పన చేశారు.
జనాభా సమీకరణ (2011 గణాంకాలు)
మూడు పంచాయితి లకు కలిపి మొత్తం జనాభా 19,883.
ఎస్టీ: 2,039
ఎస్సీ: 3,256
ఓసీ: 13,555
ఈ గణాంకాలు సామాజిక సమీకరణలో ఓసీ ఆధిక్యతను సూచిస్తున్నప్పటికీ, ఎస్టీ – ఎస్సీ వర్గాల ప్రభావం కూడా నిర్లక్ష్యం చేయలేని స్థాయిలో ఉంది.
ఓటర్ల ధోరణి – కాలానుగుణ మార్పు లు పరంగా
2018 స్థానిక ఎన్నికలు: మొత్తం ఓటర్లు 13,122
2023 శాసనసభ ఎన్నికలు: మొత్తం ఓటర్లు 16,099
ప్రస్తుతం (మున్సిపాల్టీ): మొత్తం ఓటర్లు 16,850
ప్రస్తుత ఓటర్లలో
పురుషులు: 8,084
మహిళలు: 8,762
ఇతరులు: 4
మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం, వార్డు స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ అంశాలే ప్రధాన అజెండాగా మారనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
22 వార్డులు – 22 సమీకరణలు
మొత్తం 22 వార్డులతో ఏర్పడిన అశ్వారావుపేట మున్సిపాల్టీ, ప్రతి వార్డులో భిన్నమైన సామాజిక–రాజకీయ సమీకరణ లతో ఆసక్తికర పోరుకు వేదిక కానుంది. రిజర్వేషన్ తుది నిర్ణయం వెలువడిన తర్వాతే స్పష్టమైన రాజకీయ దిశ తేలనుంది.
మొత్తంగా, చరిత్ర, సామాజిక నిర్మాణం,ఓటర్ల గణాంకాలు మొత్తం కలిసి అశ్వారావుపేట మున్సిపాల్టీ తొలి ఎన్నికలను అత్యంత ఆసక్తికరంగా మార్చుతున్నాయి.
చైర్మన్ ను కౌన్సిలర్ లు ఎన్నుకునే అవకాశం ఉండటంతో తొలి చైర్మన్ పీఠం ఎవరిని వరించనుందో,ఏ సామాజిక వర్గం కైవసం చేసుకోనున్నదో అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


