నవతెలంగాణ-హైదారాబాద్: బంగ్లాదేశ్‌లో మరోసారి రాజకీయ ప్రకంపనలు తలెత్తనున్నాయి. అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లర్ల చెలరేగడంతో..ఆ దేశం వదిలి షేక్ హాసీనా భారత్ లో తలదాచ్చుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేక ప్రవనాలు వీస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రతిపక్షపార్టీలు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌ని తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అయితే ఈ విషయంలో రాజకీయ పార్టీలు తనకు మద్దతు ఇవ్వకపోతే కచ్చితంగా తన పదవికి రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే యూనస్‌ని రాజీనామా చేయవద్దని కేబినెట్ మంత్రులు అతనిని ఒప్పించినట్లు అక్కడ స్థానిక మీడియా పేర్కొంది.
కాగా, గురువారం యూనస్ పాలనకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) మద్దతుదారులు కవాతు నిర్వహించారు. నిరసనలు చేశారు. ఆ దేశంలో ఎన్నికలు జరపాలని, ఎన్నికల తేదీని ఖరారు చేయాలని బిఎన్‌పి పార్టీ మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో యూనస్ రాజీనామాకు సిద్ధమయ్యారు. అయితే ఈ విషయంపై నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ నహిద్ ఇస్లామ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘యూనస్ రాజీనామా చేయనున్నారనే విషయం తెలిసి మేమంతా యూనస్‌ని కలిశాము. ఆ సమయంలో యూనస్ తాను రాజీనామా విషయంపై ఆలోచిస్తున్నానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పని చేయలేనని.. అందుకే రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు చెప్పారని’ ఆయన అన్నారు.