నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం మున్సిపల్ రాజకీయం వేడెక్కుతుంది. రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. స్వతంత్ర అభ్యర్థుల కుటుంబ సభ్యుల అరెస్టుల పర్వానికి తెర లేపారు. బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్టులు కొనసాగుతున్నాయి. దాంతో మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు చేరుకుంటుంది. తమ కార్యకర్తలను విడిపించుకునేందుకు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పోలీస్ స్టేషన్కు అనుచరులతో కలిసి చేరుకున్నారు. దాంతో మున్సిపల్ రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా.. నేను అన్నట్లుగా ఆధిపత్య కోరు కొనసాగుతోంది. మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ఇరు పార్టీలు తమ శక్తి యుక్తులను ప్రదర్శిస్తున్నాయి. ఈ తరుణంలోనే పార్టీ ఫిరాయింపులు పెరుగుతున్నాయి. అయితే ఇటీవల ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో టికెట్ ఆశించి బంగపడిన మొద్దు సుష్మా కరుణాకర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆమె ప్రచారం ఉధృతంగా సాగుతోంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయలక్ష్మి జంగారెడ్డికి కొరకరాని కొయ్యగా మారారు. దాంతో ఏదో పేరుతో మొద్దు కరుణాకర్ రెడ్డిని కట్టడి చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుష్మా కరుణాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఫోటోలు వేస్తూ వేసిన గోడపత్రికలను ఆసరా చేసుకొని అతన్ని గురువారం ఉదయం ఐదు గంటలకే అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు.
మాట్లాడి పంపిస్తామని చెప్పి తీసుకువచ్చి మధ్యాహ్నం రెండు దాటిన ఆయన విడుదల చేయలేదు. ఆయన అక్రమ అరెస్టును నిరసిస్తూ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీసులతో చర్చించారు. మాట్లాడి పంపిస్తామని చెప్పి పోలీసులు దాటవేశారు. ఇదిలా ఉంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సోయల్ అనే కార్యకర్త తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నాటి నుండి 13వ వార్డులో ఆకుల సురేష్ వెంట ప్రచారం కొనసాగిస్తున్నారు. అతని కట్టడి చేయాలని పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు పిలిపించుకున్నారు.
అతన్ని పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు జగదీష్ తో పాటు చిన్న అనే కార్యకర్త కోటాలను బెదిరిస్తున్నారని పోలీస్ స్టేషన్ కు రప్పించారు. మొత్తంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అరెస్టుల పర్వానికి తెరలేపారు. తమ పార్టీ కార్యకర్తలు విడిపించుకునేందుకు బీఆర్ఎస్ యువ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. పోలీసులతో చర్చించి తన అనుచరులను బయటకు తీసుకుని వచ్చారు. అనంతరం ఆయన అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు చేశారు. దమ్ముంటే ఎన్నికల్లో తేల్చుకుందామని, తమ కార్యకర్తలను భయభ్రాంతులను గురిచేయడం, అరెస్టులు చేయించడం సరికాదని మండిపడ్డారు.



