– పీఠాలను దక్కించుకునేందుకు పార్టీల వ్యూహాలు
– 36 మున్సిపాల్టీల్లో మెజారిటీ పీఠాలపై కాంగ్రెస్ దృష్టి
– నిజామాబాద్‌లో మద్దతిస్తే బోధన్ చైర్మెన్ సీటు ఆశిస్తున్న ‘పతంగి’ పార్టీ
– మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్
– మేయర్ రేసు నుంచి తప్పుకున్న బీజేపీ
– కరీంనగర్‌పైనా అధికార పార్టీ కన్ను
– అన్ని మున్సిపల్స్ నుంచి క్యాంప్‌నకు తరలిన ‘విజేతలు’
నవతెలంగాణ- విలేకరులు
రాష్ట్రంలో జరిగిన 116 మున్సిపల్, ఏడు మున్సిపల్ కార్పొరేషన్‌ల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌పార్టీ 66 మున్సిపాల్టీలను, నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. 13 మున్సిపాల్టీలను బీఆర్‌ఎస్ దక్కించుకుంది. ఇంకా 36 మున్సిపాల్టీలు, మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో పాలకవర్గం ఏర్పడేందుకు కావాల్సిన మెజార్టీ స్థానాలు దక్కలేదు. హంగ్ ఏర్పడింది. ఇందులో కొన్ని ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో దక్కించుకునే మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లు ఉండగా, ఎక్స్ అపిషియో సభ్యులతో బయటపడే మున్సిపాలిటీలు మరికొన్ని ఉన్నాయి. హంగ్ ఏర్పడిన 36 మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థులతో బేరాసారాలు సాగిస్తున్నాయి. పదవుల పేరిట మచ్చికం చేసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. 36 మున్సిపాల్టీల్లో మెజార్టీ మున్సిపాల్టీలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్‌పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. కొన్ని మున్సిపాల్టీలను దక్కించుకునేందుకు బీఆర్‌ఎస్ కూడా తీవ్రంగానే కష్టపడుతోంది. అదేవిధంగా మిగిలిన మూడు కార్పొరేషన్లను తమ ఖాతాల్లో వేసుకునేందుకు కాంగ్రెస్‌పార్టీ గట్టిగానే ప్రయత్నం చేస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7 మున్సిపాల్టీలను స్పష్టమైన ఆధిక్యతతో దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ హంగ్‌గా ఉన్న మహబూబాబాద్, జనగామ, వర్ధన్నపేట, కేసముద్రం మున్సిపాల్టీలను దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నది. ఎక్స్ అఫిషియో ఓట్లతో ఈ మున్సిపాల్టీలను చేజిక్కించుకోవడానికి మంత్రాంగం నడుపుతోంది. మహబూబాబాద్ మున్సిపాల్టీలో కాంగ్రెస్ బలం 13 కాగా బీఆర్‌ఎస్ బలం 11. ఇక్కడ సీపీఐ(ఎం) కాంగ్రెస్‌కు మద్దతునిస్తుండగా, సీపీఐ బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. 5గురు ఇండిపెండెంట్లుండగా, ఇందులో ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్ శిబిరానికి చేరుకున్నట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ బలం 19కి చేరింది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 19 సభ్యుల బలం కాగా, ఇదే వాస్తవమైతే కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ మున్సిపాల్టీని చేజిక్కించుకున్నట్టే. జనగామ మున్సిపాల్టీలో కాంగ్రెస్ 12, బిఆర్‌ఎస్ 13 కౌన్సిలర్లను గెలుచుకుంది. సిపిఐ(ఎం) 1, ఇండిపెండెంట్లు 4గురున్నారు. కాంగ్రెస్ పార్టీకి సిపిఐ (ఎం) మద్దతు వుంది. ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేయడంతో కాంగ్రెస్ బలం ప్రస్తుతం 13 కౌన్సిర్లకు పెరిగింది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 16 అంటే కాంగ్రెస్‌కు మరో ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతు అవసరం. జనగామ మున్సిపాల్టీలో బిఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా వుండడంతో ఆయన ఓటును ఇక్కడ వినియోగించుకుంటారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా వుండడంతో ఆయన ఓటు కాంగ్రెస్ బలాన్ని 14కు చేరుస్తుంది. ఇండిపెండెంట్లపైనే కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారు. తొర్రూరు మున్సిపాల్టీని చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. తొర్రూరులో మున్సిపాల్టీలో కాంగ్రెస్ 7, బిఆర్‌ఎస్ 9 మంది కౌన్సిలర్లను గెలుచుకుంది. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఓటుతో ఇక్కడ కాంగ్రెస్ బలం 8కి పెరుగనుంది.వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్యను ఇక్కడ ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా ఓటు హక్కును వినియోగించుకుంటే కాంగ్రెస్, బిఆర్‌ఎస్ బలం సమానంగా 9కి చేరుతుంది. అప్పుడు టాస్ కీలకంగా మారే అవకాశముంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌తో పాటు బోధన్, కామారెడ్డి మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడిన విషయం విధితమే. మేయర్, చైర్మన్ సీట్లు పొందేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సీట్లు గెలవకపోవడంతో పొత్తులపై చర్చలు సాగుతున్నాయి. అయితే నిజామాబాద్, బోధన్‌లో ఎంఐఎం అత్యధిక స్థానాలు గెలవడంతో కాంగ్రెస్‌కు.. ఎంఐఎంతో జత కట్టడం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో మద్దతు కోసం ఎంఐఎం కిటుకు(కండీషన్) పెట్టినట్టు సమాచారం. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌కు మద్దతిస్తే.. బోధన్‌లో చైర్మన్ సీటు ఆశిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు చర్చలు సాగుతున్నాయి. అయితే కామారెడ్డిలో పొత్తులపై ఇంకా సమీకరణాలు కొలిక్కి రాలేవు. స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు గెలవగా.. వారికి కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడంతో ఆ పార్టీ బలం 22కు పెరిగింది. మరో మూడు సీట్ల దూరంలో ఉంది. ఇక్కడ బీజేపీ 16, బీఆర్‌ఎస్ 11 గెలవడంతో బీఆర్‌ఎస్ మద్దతు కీలకమైంది. ఆయా మున్సిపాల్టీల్లో ముందస్తుగా గెలిచిన వారిని క్యాంపులకు తరలించినట్టు సమాచారం.
పరిగి చైర్మెన్ పీఠం కోసం అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. 18 వార్డులలో కాంగ్రెస్ 8, బీఆర్‌ఎస్ 8, ఇద్దరూ ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు సమానంగా కౌన్సిలర్లు రావడంతో స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. స్వతంత్ర అభ్యర్థుల కోసం ఇరు పార్టీల నాయకులు గొడవపడ్డారు. ఒకటో వార్డుకు చెందిన స్వతంత్ర అభ్యర్థి కురువ అక్కమను బీఆర్‌ఎస్ నాయకులు తీసుకెళ్లగా, మూడో వాడికి చెందిన స్వతంత్ర అభ్యర్థి మూడవత్ హనుమంతు నాయక్‌ను కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లారు. దీంతో చైర్మెన్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ మొదలైంది. ఎక్స్‌అపిషియో సభ్యులు కీలకం అవుతారు. మొయినాబాద్‌లో 26 వార్డులకుగాను కాంగ్రెస్ 10, బీఆర్‌ఎస్ 7, బీజేపీ 4, ఇతరులు 5 మంది గెలిచారు. ఇక్కడ ఆయా పార్టీలు తమ అభ్యర్థులను క్యాంప్‌లకు తరలించారు. కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర అభ్యర్థుల సహకారంతో చైర్మెన్ పీఠం కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పలువురి స్వతంత్ర అభ్యర్థులతో ఓ మాజీ ఎంపీ మాట్లాడి.. వారిని క్యాంపునకు తరలించారు. ఆమనగల్‌లో మొత్తం 15 స్థానాల్లో బీఆర్‌ఎస్ 8, బీజేపీ 6, కాంగ్రెస్ ఒకటి గెలిచింది. అయితే ఇక్కడ బీఆర్‌ఎస్‌కు చైర్మెన్ పీఠం దక్కకుండా.. బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఎక్స్‌ఆఫీషియో ఓట్లతో చైర్మెన్ పీఠం కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గద్వాల్‌లో కాంగ్రెస్ ఛైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఇబ్బంది కరంగా మారనున్నది. కాంగ్రెస్ 16, ఇద్దరు ఇండిపెండెంట్‌లు కలిపి 18 అవుతాయి. ఎంఐఎం కలుపుకుంటే నే పీఠం కైవసం చేసుకొనే అవకాశమున్నది. ఎక్స్ ఆఫీషియోగా ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, ఎమ్మెల్సీల ఓటు ఎలెక్షన్ కమిషన్ నిబందన ప్రకారం మున్సిపల్‌లో ఓటు ఉంటేనే ఎక్స్ ఆఫీషియో ఓటు చెల్లు బాటు అవుతుందని చెబుతున్నాయి. అదే బిఆర్‌ఎస్, బీజేపీ జట్టు కట్టిన వారికి బీఆర్‌ఎస్ 11,బీజేపీ 07 కలిపి 18 కానున్నాయి ఒక్క ఓటు తక్కువ కానున్నది. వీరికి ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌కి ముగ్గురున్న, ఒక ఎమ్మెల్సీ బీజేపీకి వున్నా గద్వాల మున్సిపాలిటీ లో వారు ఎక్స్ ఆఫీషియో మెంబెర్ గా వేయడానికి వీలు లేదు. ఇప్పుడు గద్వాల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా నెలకొన్నది. అలంపూర్‌లో మొత్తం 10 వార్డులు ఉన్నారు.బీఆర్‌ఎస్05, కాంగ్రెస్ 05 గెలిచారు. ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఇద్దరు బీఆర్‌ఎస్ కాబట్టి ఓట్లు వేస్తారని సమాచారం. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ తదుపరి రాజకీయ సమీకరణాలపై దష్టి సారించింది. కాంగ్రెస్ తరఫున గెలిచిన 31 మంది కౌన్సిలర్లను పార్టీ నాయకత్వం శుక్రవారం ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు తరలించింది. ఎలాంటి అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా కరీంనగర్‌లో మెజారిటీ వార్డులు బీజేపీ కైవసం చేసుకుంది. అయితే మేయర్ పీఠం కోసం కావాల్సిన స్థానాలు రాలేదు. దీంతో మరో ఎనిమిది మంది అదనంగా తమ ఖాతాలో ఉన్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్‌పార్టీ కూడా కరీంనగర్ మేయర్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీఆర్‌ఎస్, ఎంఐఎం వారితో చర్చలు జరుపుతున్నది. పది స్వతంత్రులు ఉన్నారు. వారందరి బలంతో పీఠాన్ని దక్కించుకుని బీజేపీకి అవకాశం లేకుండా చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. సంగారెడ్డి లోనే కొన్ని మున్సిపాల్టీల్లో ఇదే రకమైన చర్చ నడుస్తోంది.
‘హంగ్’లపై రాజకీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



