పుదుచ్చేరిలో 86శాతం..
అసోంలో 84.42శాతం..
కేరళలో 77.45శాతం
అసోంలో ఘర్షణలు : 30మందికి గాయాలు, ఏడుగురు అరెస్టు
అసోంలో పోలింగ్ బూత్‌లో వీడియో : ఎఫ్ఐఆర్ నమోదు
న్యూఢిల్లీ : కేరళం, అసోం రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో చెదురుమదురు ఘటనలు మినహా గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మూడు చోట్లా భారీ సంఖ్యలోనే పోలింగ్ నమోదైంది. పుదుచ్చేరిలో 86శాతం, అసోంలో 84.42శాతం, కేరళలో 77.45శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అస్సాంలో సాయంత్రం ఐదు గంటలకే పోలింగ్ ముగిసినా, కేరళ, పుదుచ్చేరిల్లో మాత్రం ఆరుగంటల వరకు అనుమతించారు. ఆ సమయానికి క్యూలో వున్న వారికి టోకెన్లు ఇచ్చి ఓటు వేసేందుకు అనుమతిచ్చారు.
కేరళలో
కేరళలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ సాఫీగా, సజావుగా సాగింది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 76శాతం పోలింగ్ నమోదు కాగా, ప్రస్తుత ఎన్నికల్లో అంతకంటే అధికంగానే నమోదైంది. ఈసారి కోయకోడ్లో అత్యధికంగా 77శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, పలువురు మంత్రులు, నటులు సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేరళలో జెన్‌జీ పోలింగ్ బూత్ అందరినీ ఆకట్టుకుంది. తొలిసారి ఓటు వేసిన వారు సెల్ఫీ దిగేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. కాగా తొలిసారి ఓటు వేసిన వారందరికీ ఎన్నికల కమిషన్ ‘స్వీట్ సర్ప్రైజ్’ ఇచ్చింది. ప్రతి జిల్లాలో మొదటసారి ఓటు వేసిన 200మందికి హల్వా పంచింది.
ఎన్నికల అధికారి మృతి
అసోంలోని సోనిత్పూర్ జిల్లాలో ఎన్నికల అధికారి దేబెన్ హోరో (45) మరణించి వుండగా కనుగొన్నారు. ఆయన మరణానికి కారణమేంటో ఇంకా నిర్ధారించలేదు. నాడార్ నియోజకవర్గంలో రెండో పోలింగ్ అధికారిగా ఆయనను నియమించారు. గురువారం ఉదయం ఆయన మంచంపై స్పృహ లేకుండా పడి వుండగా చూశారు. వెంటనే అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది. ఆయన మరణించారని అధికారులు తెలిపారు.
పోలింగ్‌బూత్‌లో వీడియో : ఎఫ్ఐఆర్ నమోదు
పోలింగ్ బూత్‌ల్లో ఫోన్లు నిషిద్ధం. కేంద్రంలోకి వెళ్ళేముందు ఫోన్లు, బ్యాగ్‌లు సహా అన్ని వస్తువులను ఇచ్చి లోపలకు వెళ్లాలని ఈసీ కూడా స్పష్టంగా పేర్కొంది. కానీ అస్సాంలోని కర్బి అనగ్లాంగ్ జిల్లా యంత్రాంగం గురువారం ఇందుకు సంబంధించి ఫోలీసు ఫిర్యాదు చేసింది. ఒక పోలింగ్ స్టేషన్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను చూపిస్తునట్లుగా వున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిందని అధికారులు తెలిపారు. దిఫూ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్లో తీసిన వీడియోగా భావిస్తున్నారు. వెంటనే దీనిపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ప్రజా ప్రాతినిధ్యచట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు.
పుదుచ్చేరిలో
పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాల్లోనూ భారీగా పోలింగ్ నమోదైంది. పుదుచ్చేరిలో ఇంత భారీ స్థాయిలో (86శాతం) ఓటింగ్ నమోదవడం 2006 తర్వాత ఇదే తొలిసారి. వీవీప్యాట్ యంత్రంలోని బ్యాటరీ నుంచి పొగ వస్తుండడంతో కరైకల్‌లో ఒక పోలింగ్ బూత్‌లో కాసేపు పోలింగ్ ఆగింది. ఆ బ్యాటరీని మార్చి కొత్తది పెట్టిన తర్వాత పోలింగ్‌ను పునరుద్ధరించారు.
వామపక్ష సంఘటనకు మళ్ళీ అధికారం
రాష్ట్రంలో వామపక్ష సంఘటన తిరిగి అధికారంలోకి వస్తుందని సీపీఐ కేరళం రాష్ట్ర కార్యదర్శి వినయ్ విశ్వం పేర్కొన్నారు. వట్టియురకవులో తన ఓటు హక్కు వినియోగిం చుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను స్పష్టంగా అర్ధం చేసుకున్న ప్రజలు తమ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, దేశ సార్వభౌమాధికారం వంటి కీలకమైన స్తంభాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి ఆందోళనలే ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. దేశంలో, అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితులను ప్రస్తావిస్తూ, యుద్ధ మేఘాల నడుమే ప్రజలు ఓటు వేసారన్నారు. వామపక్షాలే విశ్వసనీయమైన ప్రత్యామ్నాయమని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ఇచ్చే శుష్క వాగ్దానాలు కాకుండా నిరుపేదలకు ఆశ, భద్రత కల్పించేది వామపక్షాలేనని అన్నారు.
అసోంలో ఘర్షణలు
అసోంలో అక్కడక్కడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 30మంది గాయపడ్డారు. ఏడుగురిని అరెస్టు చేశారు. దిబ్రూఘర్ జిల్లాలోని ఖొవాంగ్వద్ద బీజేపీ మద్దతుదారులతో జరిగిన ఘర్షణలో అసోం జాతీయ పరిషద్ (ఏజేపీ)కి చెందిన ముగ్గురు నేతలు గాయపడ్డారు. శ్రీభూమి జిల్లాలో పతార్కండి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి పోలింగ్ బూత్‌లోకి అక్రమంగా ప్రవేశించి ప్రిసైడింగ్ అధికారితో వాదన పెట్టుకోవడంతో సమస్య మొదలైంది.
నకిలీ ఓటర్లు వచ్చి అసలైన వారి ఓట్లు వేసేస్తున్నారని ఆయన వాదించారు. అలాంటిదేమీ లేదని ప్రిసైడింగ్ అధికారి అనడంతో అభ్యర్ధి ఈవీఎంను విరక్కొట్టారు. దాంతో బీజేపీ, కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య ఘర్షణ మొదలైంది. అసోంలోని 126 నియోజకవర్గాల్లో పోలింగ్ చెదురుమదురు ఘటనలతో కొనసాగింది. ఈసారి 84శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే ఇది అధికం. దల్గావ్లో అత్యధికంగా 94.57శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.
యానాంలో 89 శాతం పోలింగ్ నమోదు
యానాం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం స్వల్ప సంఘటనల మినహా ప్రశాంతంగా సాగింది. అక్కడక్కడా ఎన్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన స్వల్ప తోపులాటలతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వివాదాలను శాంతింప చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ ఘర్షణలు
మన్నాదిపేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుక్కనూన్ పోలింగ్‌స్టేషన్‌కు సమీపంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలింగ్ స్టేషన్లకు సమీపంలో ప్రచారం చేస్తున్నారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధితో బీజేపీ నేత, హోం మంత్రి గొడవ పడ్డారు. దాంతో ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు.



