దేశంలో వాయు కాలుష్యంతో పాటు చలి పెరిగిందన్నది ఎంత వాస్తవమో, దానికన్నా ఎక్కువగా పాలకుల నిర్లక్ష్యం పెరిగిందన్నది కూడా అంతే నిజం. ఢిల్లీలో విషగాలి ఊపిరాడనివ్వకపోతే కేంద్రం కదులుతుందా? తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకు పడిపోతేనే ప్రభుత్వం కండ్లు తెరుస్తుందా? పెరుగుతున్న చలిని కూడా ప్రభుత్వాలు అంచనా వేయకుంటే ప్రజల ఆరోగ్యం పట్ల వారి చిత్తశుద్ధి ఏమున్నట్టు? ఇప్పటికైనా దీర్ఘకాలిక రక్షణ చర్యలకు పూనుకోవాలి. వాయు నాణ్యతను బలోపేతం చేసే వ్యవస్థను పెంపొందించాలి. చలితో పేదల శ్వాస ఆగకుండా చూడాలి.
ఇవే నిజమైన పాలనకు ప్రమాణాలు.
దేశంలో వాతావరణ మార్పు ఒకవైపు, ‘కాలుష్య’ రాజకీయం మరోవైపు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ రెండింటి ముండ్లపొదల మధ్య సాధారణ ప్రజలే చిక్కి శల్యమవుతున్న పరిస్థితి. ప్రభుత్వాల ముందస్తు చర్యలు, రక్షణ ప్రక్రియలు చలికి గడ్డకట్టిన మంచులాగే ఉన్నాయి. రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం, పొగమంచు ఏర్పడటం, వాయునాణ్యత దిగజారడం వెరసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నది. ఇది వాతావరణంలో వచ్చిన మార్పే. కానీ, దేశవ్యాప్తంగా పాలకులు, కార్పొరేట్లు కలిసి సృష్టించిన కాలుష్య సంక్షోభం ఇందులో భాగం. నేడు దేశ రాజధాని ఢిల్లీ మనుషులు జీవించేందుకు కూడా వీలుకాని ప్రమాదకరస్థితికి చేరింది. ‘ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే మాస్కులు కూడా సరిపోవు’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఈ కాలుష్యం పెరగడానికి ఢిల్లీని పాలించిన గత సర్కార్‌నే కారణమని ప్రస్తుత బీజేపీ సర్కార్ వాదిస్తుంటే, ఇది ముమ్మాటికీ కేంద్రం వైఫల్యమేనంటూ ఆప్ చెబుతోంది. ఇలా.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండగా కేంద్రం ఎప్పటిలాగే చోద్యం చూస్తూ ప్రచారాలకు, ప్రకటనలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ‘ఈ విషపుగాలితో మా పిల్లల్ని చంపేస్తారా’ అంటూ ఢిల్లీవాసులు చేసిన ప్రదర్శన ఏలికల అసమర్థతను ఎత్తి చూపుతున్నది. రాజధానిలో వాయు నాణ్యత క్షీణించడం కొత్తేం కాదు, కానీ అది యేడాదికేడాది పెరగడం ఆందోళన కలిగించే అంశం. గాలి నాణ్యత సూచీ (ఎక్యూఐ)తో అత్యంత సూక్ష్మ కణాల(పీఎం)ను లెక్కిస్తారు. గత నెలరోజులుగా ఇవి ప్రమాదకర స్థితికి చేరాయి. ఈ ఎక్యూఐ స్థాుు 0-50 వరకు ఉంటే ఎటువంటి ప్రభావం ఉండదు. 50 నుంచి 100 వరకు ఉంటే చిన్నపాటి ప్రభావం మాత్రమే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఢిల్లీలో దీని స్థాయి 350 నుంచి 399 వరకు నమోదవడం అతిపెద్ద హెచ్చరిక. దీంతో చలికి గురైన వృద్ధులు, రోడ్లపై పనిచేసే దినసరి కూలీలు, రహదారులను శుభ్రపరిచే కార్మికులు, ఆస్తమాతో బాధపడే చిన్నారుల పరిస్థితి దయనీయం.
వారికి చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీరిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? సర్కారుది కాదా! ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కొంతైనా మెరుగ్గా ఉండేది. కానీ బీజేపీ డబులింజన్ సర్కార్ ఢిల్లీని కాలుష్యకోరల నుంచి బయటపడేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించలేదు. ఫలితంగా ఇప్పటికే ఢిల్లీలో గ్రాప్(జీఆర్‌ఎపీపీ) స్టేజ్ త్రీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా వాయు కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంటల దహనం కారణంగా చూపెడుతున్నా అది చిన్నది మాత్రమే. పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం, పెరిగిన వాహనాలు, నిర్మాణాల ధూళి ఢిల్లీవాసుల్ని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదన్నది సత్యం. అయితే ఈ వాయుకాలుష్యం దక్షిణాది దిశగా పయనిస్తూ తెలంగాణను తాకుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించడం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే, రాష్ట్రంలో వారం రోజులుగా చలి పులి పంజా విసురుతున్నది. ఉత్తరాది జిల్లాల్లో జనం బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి. సాధారణంగా పగలు 26నుంచి 30 వరకు ఉండే ఉష్ణోగ్రతలు, రాత్రి సమయంలో పది నుంచి పదిహేను వరకు పడిపోతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
పంతొమ్మిది జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పన్నెండు డిగ్రీలలోపునకు పడిపోవడటం మాటలు కాదు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనైతే పది నుంచి 8.2 రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవ్వడం పరిస్థితికి అద్దం పడుతున్నది. ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, సీజనల్ ఫ్లూ జలుబు, దగ్గు పెరుగుతున్నవి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం, దగ్గు, గొంతు తడారిపోవడం, నొప్పులు వంటి లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. గర్భిణులు, ఐదేండ్లలోపు చిన్నారులపై దీని ప్రభావం అధికంగా ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతిని నిందిస్తూ వాతావరణంలో తేమ లేదని, వేడిని గ్రహించేందుకు మేఘాలు ఏర్పడటం లేదని అధికార యంత్రాంగం చెప్పడం హాస్యాస్పదం. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేయడంకాదు, వారికి అవగాహన కల్పిస్తూ రక్షణ చర్యలు తీసుకోవడం ప్రధానం. దేశంలో వాయు కాలుష్యంతో పాటు చలి పెరిగిందన్నది ఎంత వాస్తవమో, దానికన్నా ఎక్కువగా పాలకుల నిర్లక్ష్యం పెరిగిందన్నది కూడా అంతే నిజం. ఢిల్లీలో విషగాలి ఊపిరాడనివ్వకపోతే కేంద్రం కదులుతుందా? తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకు పడిపోతేనే ప్రభుత్వం కండ్లుతెరుస్తుందా? పెరుగుతున్న చలిని కూడా ప్రభుత్వాలు అంచనా వేయకుంటే ప్రజల ఆరోగ్యం పట్ల వారి చిత్తశుద్ధి ఏమున్న ట్టు? ఇప్పటికైనా దీర్ఘకాలిక రక్షణ చర్యలకు పూనుకోవాలి. వాయు నాణ్యత ను బలోపేతం చేసే వ్యవస్థను పెంపొందించాలి. చలితో పేదల శ్వాసఆగకుండా చూడాలి. ఇవే నిజమైన పాలనకు ప్రమాణాలు.



