గాలి నాణ్యత సూచీ 400 మార్కును దాటిన వైనం
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీని కాలుష్య మేఘాలు కమ్మేశాయి. దట్టమైన దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తోంది. అనేక ప్రాంతాల్లో ఆదివారం ‘తీవ్రమైన’ వాయు కాలుష్య స్థాయిలను ఎదుర్కొన్నాయి. గాలి నాణ్యత సూచిక (ఎక్కుఐ) 400 మార్కును దాటింది. ఆనంద్ విహార్, చాందిని చౌక్, నెహ్రూ నగర్, ఆర్కే పురం, రోహిణితో సహా అనేక ప్రాంతాలు 400 కంటే ఎక్కువ ఎక్యుఐ నమోదు చేశాయి.
దట్టమైన పొగమంచు నగరాన్ని ఆవరించింది. అయితే కృత్రిమ వర్షాల కోసం తాము చేపట్టిన క్లౌడ్ సీడింగ్ (మేఘ మథనం) కారణంగా వాయు కాలుష్య తీవ్రత తగ్గిందని ఢిల్లీలోని బిజెపి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజల ప్రాణాలతో బిజెపి క్రూర పరిహాసమాడుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే పార్టీకి చెందిన నాయకులు, వాయినాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ సైతం ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా ఈ సమస్యను ఎదుర్కొందామని, ఇందుకోసం తగిన కార్యచరణ తక్షణమే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె కోరారు.
కాగా కాలుష్య కారణంగా ఢిల్లీలో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిందని వైద్యులు తెలిపారు. ప్రజలు క్రమం తప్పకుండా ఎయిర్-ప్యూరిఫైయర్లను వినియోగించాలని సూచించారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు రాబోయే కొన్ని వారాల పాటు ఢిల్లీని విడిచిపెట్టి వెళ్లాలని, తద్వారా నగరంలోని వాయు కాలుష్యం నుండి దూరంగా ఉండాలని పల్మోనాలజిస్ట్ గోపీ చంద్ ఖిల్నాని పేర్కొన్నారు.
ఢిల్లీని కమ్మేసిన కాలుష్య మేఘాలు
- Advertisement -
- Advertisement -



