మంత్రి అక్రమాలపై స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలి
అక్రమ మైనింగ్, భూకబ్జాలపై చర్యలు తీసుకోవాలి
గవర్నర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు..సాక్ష్యాధారాలు అందజేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఆయన అక్రమ మైనింగ్, భూకబ్జాలపై సోమవారం హైదరాబాద్ లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్, భూకబ్జాలపై సాక్ష్యాధారాలను అందజేసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అక్రమాలపైన స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలనీ, లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేసింది. రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ మైనింగ్ నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపింది. జంట జలాశయాల పరిధిలో మైనింగ్ నిషేధం ఉన్నా అక్రమంగా మైనింగ్‌కు పాల్పడిందని విమర్శించింది.
సంబంధం లేని భూమిని చెరబట్టి ఎలాంటి మినరల్ డీలర్ లైసెన్స్, పొల్యూషన్ బోర్డు అనుమతి, విద్యుత్ కనెక్షన్లు, పరిశ్రమల శాఖ అనుమతి లేకుండా రెండేండ్లుగా రూ.వందల కోట్ల ప్రజా సంపదను కొల్లగొట్టిందని వివరించింది. మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరితే సభ నుంచి తమను ప్రభుత్వం బహిష్కరించిందని తెలిపింది. అనంతరం మీడియాతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి రాష్ట్ర సంపదను కొల్లగొట్టారని విమర్శించారు. శాసన సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తే అన్ని వాస్తవాలూ బయటకు వస్తాయని చెప్పారు.
మంత్రి పొంగులేటి రూ.వందల కోట్ల అక్రమ మైనింగ్‌తోపాటు అక్రమ భూకబ్జాలు బయటకు వస్తాయన్నారు. ప్రభుత్వ ఏజెన్సీలతోనే విచారణ జరిపిస్తామంటున్నారనీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే స్వయంగా హోంమంత్రి బాధ్యతల్లో ఉన్నపుడు సీబీసీఐడీ విచారణ లేదా రాష్ట్ర హోం శాఖ అధికారులతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. అందుకే ఒక శాసనమండలి, శాసనసభ్యులతో కూడిన సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదా స్వతంత్ర న్యాయ విచారణ, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని గవర్నర్‌కు వివరించామన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఇందిరమ్మ పాలన రోజులు గుర్తుకొస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ దోపిడీని ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామని చెప్పారు. బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు.
రైట్ టు ఇన్మర్మేషన్ యాక్ట్‌ను రూట్ టు ఇన్‌కంగా ఆయన మార్చుకున్నారని వివరించారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఆయనకు తెలిసినంతగా ఈ దేశంలో మరెవరికీ తెలియవన్నారు. 14 అంశాలపై విచారణ చేయాలంటూ సీఎంకు లేఖ రాశామని గుర్తు చేశారు. వాటిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే పొంగులేటిని బర్తరఫ్ చేసి విచారణ జరపాలన్నారు. మంత్రిగా ఉన్నందున ఆయన విచారణను ప్రభావితం చేసే అవకాశముందని చెప్పారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ అంశంలో సాక్ష్యాధారాలను ఇచ్చినా బీజేపీ మౌనంగా ఉందనీ, ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, పొంగులేటి అక్రమ మైనింగ్, భూకబ్జాలపైన త్వరలోనే మరింత కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు.



