మూడు జిల్లాల ప్రతినిధులతో సమీక్ష
సమస్యలపై విరివిగా వినతులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆర్టీసీ సమస్యలపై మూడో రోజూ ముఖాముఖి సమావేశం కొనసాగింది. శనివారం హైదరాబాద్‌లోని శాసనసభ కమిటీ హాల్-1లో ఆదిలాబాద్, కరీంనగర్ , ఖమ్మం జిల్లాల ప్రజా ప్రతినిధులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ వి.నాగిరెడ్డి భేటీ అయ్యారు. ఉమ్మడి జిల్లాల వారిగా తమ నియోజకవర్గాల్లో కొత్త బస్సులు, కొత్త రూట్లు , బస్ స్టేషన్ల అభివద్ధి , బస్సుల హాల్టింగ్, బస్ డిపోల అవసరాలు, టాయిలెట్ల నిర్మాణాలపై చర్చించారు. ప్రజాప్రతినిధులతో ఆర్టీసీపై అధికారులు సమన్వయం చేసుకుంటూ సంస్థకు మంచిపేరు తేవాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో నియోజకవర్గాల వారిగా కావాల్సిన మౌలిక సదుపాయాలు, కొత్త బస్సులు, బస్సుస్టేషన్ల అభివృద్ధి , కొత్త రూట్లు, బస్ డిపోల అవసరాల మాట్లాడారు.
చెన్నూరు నియోజకవర్గంలో బస్‌స్టేషన్ అభివృద్ధితో పాటు కొత్త రూట్లల్లో బస్సులు నడిపించాలని మంత్రి వివేక్ వెంకట్‌స్వామి సూచించారు. సింగరేణి ఏరియాలో కార్మికులకు ఇబ్బందులు లేకుండా గతంలో నడిచిన రూట్లతో పాటు అదనపు రూట్లల్లోనూ బస్సులు నడిపించాలని కోరారు. కోరుట్ల నియోజకవర్గంలో మెట్‌పల్లి, కోరుట్ల బస్‌స్టేషన్లను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ కి విజ్ఞప్తి చేశారు. మొగిలిపేట ప్రధాన రహదారిపై బస్సులు ఆగేలా చూడాలని కోరారు. మండలాల వారిగా హైదరాబాద్‌కి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. వేములవాడకు సిరిసిల్ల, కోరుట్ల ,జగిత్యాల, మెట్‌పల్లి డిపో నుంచి బస్సులు పెంచాలని సూచించారు. వేములవాడ , చందుర్తి బస్ స్టేషన్లను మోడర్న్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్‌లో ఇప్పటికే రూ1.5 కోట్లతో నిర్మించామనీ, దానికి మరిన్ని నిధులు కేటాయిస్తే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు.
పెద్దపల్లి నుంచి హైదరాబాద్, హనుమకొండకు కొత్త బస్సులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 15 కొత్త బస్సులు కావాలని కోరారు. కోడిమ్యాల బస్‌స్టేషన్ పనులు ప్రారంభించాలని సూచించారు. విద్యార్థుల స్కూల్ సమయంలో అదనంగా బస్సులు నడపాలని విజ్ఞప్తి చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో జగిత్యాల నుంచి కడెం బస్సులు నడిపించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సూచించారు. ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ కి బస్సులు పెంచాల న్నారు. ఉట్నూరు ఆదిలాబాద్ మధ్య బస్సులు నడిపించాలని ఉట్నూరు ఆర్టీసీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని కోరారు. 2027 జూన్‌లో పుష్కరాలు సమీపిస్తుండటంతో బాసరలో బస్‌స్టేషన్ ఆధునీకరించాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ విజ్ఞప్తి చేశారు. ఫ్లాట్ ఫామ్ పెంచాలని, టాయిలెట్స్ నిర్మించాలని కోరారు. భైంసా నుండి పోహ్రాద్ బస్సులు నడపాలన్నారు.
సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బస్‌స్టేషన్ అభివృద్ధి చేయాలని రోడ్లతో సంబంధం లేకుండా మారుమూల ప్రాంతాల్లో బస్సులు నడపాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో అదనంగా బస్సులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇల్లందు నియోజకవర్గంలో అదనంగా బస్సులు నడపాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య కోరారు. వైరా నియోజకవర్గం నాలుగు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉందని అదనంగా బస్సులు వేయాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కోరారు. సమీక్షా సమావేశంలో కరీంనగర్ ఆదిలాబాద్ , ఖమ్మం ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, డా సంజయ్ కుమార్, కౌశిక్ రెడ్డి , మేడిపల్లి సత్యం, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, విజయ రమణ రావు , వెడ్మా బొజ్జు, కోవా లక్ష్మీ , అనిల్ జాదవ్ , రామారావు పటేల్ ,పాల్వాయి హరీశ్ బాబు, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్, జారే ఆది నారాయణ, కోరం కనకయ్య, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడిలు, ఆర్‌ఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



