No menu items!
Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంజనాభా మిషన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండానే

జనాభా మిషన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండానే

- Advertisement -

– అందుకే ఎర్రకోటపై నుంచి ఆ రెండింటి ప్రస్తావన
– జీఎస్టీ సవరణ ప్రయోజనాలు వినియోగదారులకు అందాలి
– ‘సర్‌’తో బీహార్‌ ప్రజల్లో అసంతృప్తి
– రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించేలా కేంద్ర బిల్లులు
– సుంకాలపై అమెరికా ఒత్తిళ్లకు లొంగొద్దు
– ‘ఇండియా’ ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి విజయం కోసం అన్ని పక్షాలతో సమన్వయం
– వరద మృతులకు సంతాపం: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు
– అందుకే ఎర్రకోటపై నుంచి ఆ రెండింటి ప్రస్తావన
న్యూఢిల్లీ :
ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ప్రస్తావించడాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. దీని ద్వారా స్వాతంత్య్ర పోరాటంలో ఎటువంటి పాత్ర పోషించని ఆర్‌ఎస్‌ఎస్‌ను చట్టబద్ధం చేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించింది. ప్రధాని తన ప్రసంగంలో ప్రజా వ్యతిరేక సంస్కరణలతోపాటు ‘జనాభా మిషన్‌’ ఏర్పాటును కూడా ప్రకటించారనీ, చొరబాటుదారులను గుర్తించే పేరుతో ముస్లిం మైనారిటీలను వేధించడానికి ఈ మిషన్‌ ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. ముస్లింలను చొరబాటుదారులుగా చిత్రీకరించి వారందరినీ దేశం నుంచి గెంటేయాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారానికి చట్టబద్ధత కల్పించేం దుకే దీనిని ఉద్దేశించారని స్పష్టం చేసింది. సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సమావేశం సోమవారం జరిగింది. ఆ వివరా లతో మంగళవారం నాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

జీఎస్టీ సవరణపై…
దీపావళి రోజున జీఎస్టీ రేట్లను తగ్గిస్తామని ప్రధాని ప్రకటించారు. ఈ తగ్గింపు ప్రయోజనాలు కార్పొరేట్లకు కాకుండా వినియోగదారులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీనివల్ల ఆదాయాన్ని నష్టపోతే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలి.

సర్‌-ఈసీఐపై…
రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపకుండా జూన్‌ 24న కేంద్ర ఎన్నికల సంఘం బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)ను ప్రకటించడంతో అది ప్రారంభం నుంచే వివాదంలో చిక్కుకుంది. ఎందుకంటే జూన్‌ 24 తర్వాత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. ఇది సంప్రదాయాలకు విరుద్ధం. విస్తృత సవరణలు చేపట్టాలంటే ఓటర్ల జాబితా తయారీకి, సంప్రదింపులకు ఎక్కువ సమయం పడుతుంది. దేశంలోని ప్రతి పౌరుడికీ ఓటు హక్కును సార్వత్రికం చేయాలన్నది తొలి ఎన్నికల సంఘం నుంచీ సాధారణంగా అమలులో ఉన్న సూత్రం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326కి అనుగుణంగా ఓటర్ల జాబితాను రూపొందించే బాధ్యత ఎన్నికల సంఘానిదే. నిబంధనల ప్రకారం అభ్యంతరాలను పరిశీలించి, హోం మంత్రిత్వ శాఖను సంప్రదించి ఆ ప్రాతిపదిక పైనే పేర్లను తొలగించాల్సి ఉంటుంది.

ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి, పదకొండు పత్రాలలో దేనితో అయినా రాతపూర్వకంగా దరఖాస్తును స్వీకరించాలని సర్‌ నిర్దేశించింది. అయితే ఈ పత్రాలలో చాలా వరకూ బీహార్‌లో అందుబాటులో లేవు. నిర్దేశించిన పత్రాన్ని జత చేయకపోవడంతో చాలా మంది ఓటు హక్కును కోల్పోయారు. ఓటర్లు నమోదు చేయని వారిని అసలు పౌరులుగానే గుర్తించకుండా వారి పేర్లను తొలగించే కసరత్తు జరిగింది. ఇలా చేయడం ఆర్టికల్‌ 326ను, సార్వత్రిక ఓటు హక్కు సూత్రాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుంది. ప్రతిపక్ష పార్టీలన్నీ సంఘటితంగా ఎన్నికల సంఘాన్ని కలిసినప్పటికీ ఓటు హక్కును మూకుమ్మడిగా రద్దు చేసే ప్రమాదాన్ని నివారిస్తామని అది ఎటువంటి హామీ ఇవ్వలేదు. అంటే ప్రతిపక్షాల అభ్యర్థనను తోసిపుచ్చిందన్న మాట.

ఈసీ వైఖరి కారణంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఓటు హక్కు రద్దు కాకుండా పౌరులను కాపాడేందుకు ముందుకు వచ్చాయి. సుదీర్ఘ చర్చల తర్వాత ‘సర్‌’ సమయంలో తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల పేర్లను, తొలగించడానికి కారణాలను ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘సర్‌’ ప్రక్రియను పారదర్శకంగా కొనసాగించడంలో ఈసీ విఫలమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు స్వాగతించదగినవి. చాలా మంది పరిశో ధకులు వేలెత్తి చూపినట్లుగా మైనారిటీలు, మహిళలు, పేదలు ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు కోల్పోయారు. ఈ ప్రక్రియపై బీహార్‌లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఈ ప్రక్రియను వ్యతిరేకించాయి. ఆగస్ట్‌ 15న ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని ‘చొరబాటుదారుల’ ప్రస్తావన తీసుకొచ్చారు. చొరబాటుదారుల ఏరివేతపై ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న ప్రచారాన్ని ఈసీ పక్షపాత పూరితంగా అమలు చేస్తోంది. ప్రజలను సమీకరించి, వారిని చైతన్య పరచడం ద్వారా ఈసీ వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది.

పార్లమెంట్‌ సమావేశాలౖ…
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ‘సర్‌’ ప్రక్రియపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అయితే బీహార్‌లో చేపట్టిన ‘సర్‌’పై చర్చకు అనుమతించడానికి ప్రభుత్వం నిరాకరించింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించే క్రీడా బిల్లుతో సహా అనేక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గనులు-ఖనిజాల చట్టాన్ని, అణు బాధ్యత చట్టాన్ని సవరిచేందుకు ఉద్దేశించిన బిల్లులను ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఖనిజ అన్వేషణ, అణుశక్తి ఉత్పత్తి వంటి కీలక రంగాలలోకి ప్రయివేటు, విదేశీ పెట్టుబడులు ప్రవేశించేందుకు వీలుగా ఈ బిల్లులను ప్రవేశపెడుతున్నారు.
దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ బిల్లులను వ్యతిరేకించాలని అన్ని రాజకీయ పక్షాలనూ పొలిట్‌బ్యూరో కోరింది. కీలకమైన అంశాలపై చర్చకు అనుమతించకుండా ప్రభుత్వం మొండిగా నిరాకరించడం దాని నిరంకుశ స్వభావాన్ని చాటిచెబుతోంది. ప్రభుత్వ వైఖరి కారణంగా ప్రజలను ప్రభావితం చేసే పలు అంశాలపై పార్లమెంటులో చర్చకు నోచుకోవడం లేదు.

భారత్‌పై సుంకాలపై…
భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోలేకపోవడంతో ఇరవై ఐదు శాతం సుంకాలు, రష్యా నుంచి చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్నందుకు మరో ఇరవై ఐదు శాతం సుంకాలు వడ్డించింది. ఈ సుంకాల భారం వ్యవసాయం, మత్స్య రంగం, ఎంఎస్‌ఎంఈలు, ముఖ్యంగా వస్త్ర తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఎందుకంటే అధిక ధరల కారణంగా అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి.

రష్యా నుంచి భారత్‌ చమురు దిగుమతులను తగ్గించుకొని, తన ఇంధన అవసరాల కోసం వాషింగ్టన్‌పై ఎక్కువగా ఆధారపడాలని అమెరికా కోరుకుంటోంది. భారత ప్రభుత్వం రాయితీలు పొందాలన్న ఆశతో అమెరికా విమానయాన సంస్థల నుంచి రక్షణ కొనుగోళ్లను గణనీయంగా పెంచుకుంటామని హామీ ఇచ్చింది. తద్వారా అమెరికాను శాంతింపచేయడానికి ప్రయత్నించింది. భారత ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోనూ అమెరికా ఒత్తిడికి లొంగకూడదు. దానికి బదులుగా ఇతర దేశాలతో సంబంధాలను పెంచుకునే విషయంపై దృష్టి సారించాలి.

జమ్మూకాశ్మీర్‌పై…
ఆర్టికల్‌ 370ని రద్దు చేసి జమ్మూకాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి ఐదు సంవత్సరాలు గడిచాయి. అయితే నిర్దేశించుకున్న లక్ష్యాలలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో లేదా జమ్మూకాశ్మీర్‌ ప్రజలకు భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తప్పుడు వాదనలను బయటపెట్టింది. ఆరు నెలలలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తానంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినందుకు కేంద్రాన్ని జవాబుదారీగా నిలపాల్సింది పోయి పహల్గాం దాడి కారణంగా రాష్ట్ర హోదా గురించి చర్చించడానికి ఇది సమయం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం దురదృష్టకరం. జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించడంతో పాటు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న డిమాండ్‌పై ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉంది.

మాలేగావ్‌ కేసులో అప్పీలుపై…
ఉగ్రవాద దాడులకు సంబంధించిన రెండు కోర్టు తీర్పులపై మహారాష్ట్ర ప్రభుత్వం భిన్నంగా వ్యవహరించింది. అవి ముంబై రైలు పేలుళ్ల కేసు (2006)…మాలేగావ్‌ బాంబు పేలుళ్ల కేసు. ముంబై రైలు పేలుళ్ల కేసులు నిందితులు ఎక్కువగా ముస్లింలు. ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో అప్పీలు చేసి కోర్టు ఉత్తర్వుపై స్టే పొందింది. మాలేగావ్‌ పేలుళ్ల కేసులో దీనికి భిన్నంగా వ్యవహరించింది. హిందూత్వ తీవ్రవాదులు నిందితులుగా ఉన్న ఈ కేసులో న్యాయస్థానం వారిని నిర్దోషులుగా విడుదల చేస్తే దానిపై అప్పీలు చేయలేదు. ఇది మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ మత పక్షపాతాన్ని బయటపెడుతోంది. మాలేగావ్‌ పేలుళ్ల కేసులో కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని, నిందితులను సరిగా విచారించి దోషులుగా నిర్ధారించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad