ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
నవతెలంగాణ-సిటీబ్యూరో
2026-27 ఆర్థిక బడ్జెట్ జనరంజకంగా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రి మార్గదర్శకాలతో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు నీళ్లు నమిలేలా బడ్జెట్ ఉందన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి పేద ప్రజల కోసం ఆలోచించలేకపోయామని ప్రతిపక్షం అనుకునే విధంగా బడ్జెట్ ఉందన్నారు.
దేశంలో ఇండ్ల నిర్మాణానికి ఏ రాష్ట్రం కూడా రూ.ఐదు లక్షలు ఇవ్వడం లేదన్నారు. ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని పేదల సంక్షేమం కోసం ప్రతిపాదిస్తే.. ఇష్టం లేక బడ్జెట్ ప్రతులను బీఆర్‌ఎస్ నేతలు చించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులకు ప్రమాద బీమా పథకం, నగదు రహిత వైద్యం అందించడమూ వారికి ఇష్టం లేదన్నారు. బడ్జెట్‌లో వైద్యం, విద్యాశాఖలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఫోర్త్ సిటీ, మూసీ నది ప్రక్షాళన అంశం ప్రస్తావన రాగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారని, ఎందుకు వాకౌట్ చేశారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పదేండ్లలో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.
అన్ని వర్గాలకు న్యాయం చేశారు
బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేవిధంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. వరి వేస్తే ఉరి అన్న వారు.. సన్న వడ్లకు బోనస్ ఇచ్చే బడ్జెట్‌ను తట్టుకోలేక పోతున్నారని, సంక్షేమ పథకాలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఇంటర్మీడియట్ పేద విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు, రైతాంగానికి పెద్దపీట వేశామని తెలిపారు.
అసెంబ్లీలో అక్కసుతో వ్యవహరిస్తున్నారని, ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నా, ఇంకా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. బడ్జెట్‌లో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులకు పెద్దపీట వేశామన్నారు. వారు బాయ్ కాట్ చేసిన తీరు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా ప్రతిపక్షాలు వక్రబుద్ధి మార్చుకొని ప్రజా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
ప్రతిపక్షాల ముఖంలో రంగులు మారాయి
బడ్జెట్ చూసి ప్రతిపక్షాల ముఖంలో రంగులు మారాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్‌తో భవిష్యత్ అభివృద్ధి వారి కండ్లకు కట్టినట్టుగా కనపడిందన్నారు. బీఆర్‌ఎస్ నేతలు మానసిక స్థితి కోల్పోయారన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి ఏం చేయకుండా ప్రతిపక్షంలో ఉండి కారుకూతలు కూస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు మిమ్ములను ప్రతిపక్షంలో కాదు, నర్సరీ తరగతిలో కూర్చోబెట్టాలని అనుకుంటున్నారన్నారు. బడ్జెట్ సమావేశాల్లో చిల్లర వేషాలు వేసిన విషయం ప్రజలు గమనించాలన్నారు.
ఇది విజన్ ఉన్న బడ్జెట్
ఇది విజన్ ఉన్న బడ్జెట్ అని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. 1.15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్, ఉద్యోగులకు బీమా, నగదురహిత వైద్యం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లాంటి మంచి పథకాలు అమలు చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే విమర్శిస్తున్నారని తెలిపారు. పదేండ్లు ప్రజల చెవిలో పువ్వు పెట్టి.. నేడు బీఆర్‌ఎస్ వారు ప్రజలు పెట్టిన పూలు పెట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
అన్ని రంగాలకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే రామచంద్రు
విద్యా, వైద్య, ఇరిగేషన్‌తోపాటు అన్ని రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారని ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ తెలిపారు. ఉద్యోగస్తులకు ప్రమాద బీమా పథకం పెడితే బీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అసెంబ్లీలో వింత చేష్టలు చేస్తున్నారని విమర్శించారు. ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ఇది హాట్రిక్ చీటింగ్ బడ్జెట్ హామీల ఎగవేతల బడ్జెట్: బేజేపీ
రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఊహాజనితంగా ఉందని, వాస్తవికతకు దూరంగా ఉందని బీజేపీ ఫ్టోర్‌లీడర్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే పాయల్ శంకర్, పాల్వారు హరీష్‌తో కలిసి మాట్లాడారు. ‘హ్యాట్రిక్ చీటింగ్ బడ్జెట్’ హామీలను ఎగవేసే విధంగా ఉందన్నారు. అప్పుల కుప్పగా ఉందని, హామీల అమలు ప్రస్తావనే లేదన్నారు. అప్పుల మీదనే ప్రభుత్వం ఆధారపడ్డట్టు ఈ బడ్జెట్‌తో స్పష్టమైందన్నారు. బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. నిరుద్యోగులను, మహిళలను మోసం చేశారని తెలిపారు. విద్యాశాఖకు 15శాతం నిధులు ఇస్తానని గత మూడు బడ్జెట్లలో కేటాయించలేదని విమర్శించారు. కాంగ్రెస్ వారి సమయం డిల్లీ టూర్లకు సరిపోతోందన్నారు. ఉద్యోగ క్యాలెండర్ ప్రస్తావన లేదన్నారు. హ్యాట్రిక్ మోసపూరిత బడ్జెట్ అన్నారు.
బీసీ సబ్ ప్లాన్ ఊసే లేదు : పాయల్ శంకర్
బడ్జెట్‌లో బీసీ సబ్‌ప్లాన్ ఊసే లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రభుత్వం నుంచి బీసీలకు సహకారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో బీసీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రభుత్వం పెన్షనర్లు జమ చేసుకున్న డబ్బులు ఇవ్వడం లేదు కానీ, విమాన ప్రమాదంలో మరణిస్తే వారికి రెండు కోట్లు ఇస్తారట అన్నారు. పంటల బీమా అమలు చేయడం లేదన్నారు. స్కాలర్‌షిప్ రాక విద్యార్థులు హోటళ్ల లో పని చేసుకుంటున్నారని తెలిపారు. ఇది మోసపూరిత బడ్జెట్ అని, సవరణ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా గురించి ప్రస్తావన లేదన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన బడ్జెట్‌లో లోపాలను సమావేశాల్లో ఎత్తి చూపుతామన్నారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం : మండలి విప్‌లు, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తామని శాసనమండలి విప్‌లు, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ నర్సింగ్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి వారు మాట్లాడారు.
అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం దక్కుతుందన్నారు. ‘మాలాంటి సామాన్య కార్యకర్తలకు మండలిలో అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాం. పార్టీ కోసం కష్టపడే వారికి అధిష్టానం ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తుంది. కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని మాకు ఇచ్చిన ఈ స్థానం మరోసారి రుజువు చేసింది” అని ఆయన అన్నారు.
ప్రజలకు వారధిగా ఉంటాం
కాంగ్రెస్ కష్టపడే కార్యకర్తలను ఎప్పుడూ విస్మరించదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌నర్సింగ్‌రావు అన్నారు. ‘రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా ప్రభుత్వం పని చేస్తోంది. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను’ అని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ.. బడ్జెట్ అన్ని రంగాల అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. ముఖ్యంగా విద్యారంగానికి పెద్దపీట వేయడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ‘బడ్జెట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యతనిస్తూనే, విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీనితో పాటు గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా గ్రామాల అభివృద్ధికి సైతం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది” అని ఆమె వివరించారు.
బడ్జెట్‌లో స్కీంలు మర్చి స్కాంలకు తెర : మాజీ మంత్రి గంగుల కమలాకర్
ఈ బడ్జెట్‌లో స్కీమ్‌లు మరిచి, స్క్యామ్‌లకు తెర లేపారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బీసీలకు నిధులు కేటాయించకుండా గొంతు కోశారని తెలిపారు. కల్యాణ లక్ష్మీతో తులం బంగారం వస్తుందని అందరూ భావిస్తే, తులం బంగారం అంటే సమ్మక్క సారక్క బెల్లం అనుకుంటున్నారని విమర్శించారు. బడ్జెట్‌ను చూసిన తర్వాత ప్రభుత్వ డొల్లతనం మొత్తం బయటపడిందన్నారు. దళితులకు కేటాయించే బడ్జెట్‌ను కుదించి వారిని మోసం చేశారన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాశారని తెలిపారు. రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్‌ని గద్దె దించడం ఖాయమన్నారు.
ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాల చెవిలో పూలు : బీఆర్‌ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజలకు చెవిలో పూలు పెట్టారని బీఆర్‌ఎస్ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానందగౌడ్ అన్నారు. బడ్జెట్‌లో హైదరాబాద్ ప్రజలను వంచించారనీ, నగరాన్ని మూడు భాగాలుగా చేసి దోచుకోవాలని చూస్తున్నట్టు తాము చెప్పిందే నిజమైందన్నారు. రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేదే హైదరాబాద్ నుంచి అనీ, నూతన కార్పొరేషన్లకు బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించలేదన్నారు.
జనరంజక బడ్జెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



