– కుటుంబానికి న్యాయం చేయాలని బి ఆర్ ఎస్ , సిపిఐ నాయకుల సంఘీభావం
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి తీరు పై అనుమానాలతో కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని , మరణానికి బాధ్యులు ఎవరో తేల్చి పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వివేక్ మృతికి కారణమైన వారిపై చట్టపైన చర్యలు తీసుకుంటామని హామీ వచ్చారు. దీంతో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి వివేక్ మృతదేహానికి హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. విద్యార్థి మృతి చెందడం పై పలు అనుమానాలు వ్యక్తం కాగా బి ఆర్ ఎస్ , సిపిఐ నాయకుల సంఘీభావం తెలిపి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో విద్యార్థులు, ప్రిన్సిపల్ ప్రమేయం తోనే తన కుమారుడు మరణించినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. ఏది ఏమైనా వివేక్ మృతి మిస్టరీగా మిగిలింది.
ప్రభుత్వం వివేక్ కుటుంబాన్ని ఆదుకోవాలి : బి ఆర్ ఎస్, సిపిఐ నాయకుల డిమాండ్
గురుకుల పాఠశాలలో మృతి చెందిన విద్యార్థి వివేక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని బి ఆర్ ఎస్, సిపిఐ నాయకుల డిమాండ్ చేశారు. వివేకమృతికి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు భద్రత కరువైందని మండిపడ్డారు. పోలీస్ దర్యాప్తు వేగవంతంగా చేపట్టి బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వివేక కుటుంబానికి రూ 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.