Saturday, October 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసమ్మర్‌ డిమాండ్‌కు విద్యుత్‌ సంస్థల కసరత్తు షురూ

సమ్మర్‌ డిమాండ్‌కు విద్యుత్‌ సంస్థల కసరత్తు షురూ

- Advertisement -

ట్రాన్స్‌కో అండ్‌ టీజీ ఎస్పీడీసీఎల్‌ అధికారులతో సమావేశం
డిసెంబర్‌ చివరి నాటికి సమ్మర్‌ యాక్షన్‌ పనులు పూర్తి చేయాలి : టీజీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ
నవతెలంగాణ-సిటీబ్యూరో

రానున్న వేసవిలో డిమాండ్‌ ఏ స్థాయిలో పెరిగినా విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని అక్టోబర్‌ చివరి నాటికి సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ పనులు ప్రారంభించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముషారఫ్‌ ఫరూఖీ ఆదేశించారు. విద్యుత్‌ డిమాండ్‌ ఏటేటా పెరుగుతున్నదనీ, దానికి తగ్గట్టు ట్రాన్స్‌ కో అండ్‌ డిస్కం అధికారులు సమన్వయం చేసుకుంటూ అదనపు చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్‌ కో, దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ డైరెక్టర్లు, చీఫ్‌ ఇంజినీర్లు, సూపరింటెండింగ్‌ ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. వచ్చే ఏడాదిలో గరిష్ట డిమాండ్‌ 19,500 మెగావాట్ల నుంచి 20వేల మెగావాట్లకు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో సైతం డిమాండ్‌ 5వేల మెగా వాట్లకు చేరే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ డిమాండ్‌ను తట్టుకోవడానికి దక్షిణ డిస్కం పరిధిలో 3,866 అదనపు డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 431 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల స్థాయి పెంచడం, అదనంగా ఏర్పాటు చేయాలని ప్రాధమికంగా నిర్ణయించినట్టు తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్‌ కోకు సంబంధించిన జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, మణికొండ, గచ్చిబౌలి, మేడ్చల్‌, శివరాంపల్లి, ఎండీ పల్లి, పటాన్‌చెరు, ఆర్‌కే పురం, బొల్లారం, బోరపట్ల, నర్సాపూర్‌, పలమాకుల సబ్‌ స్టేషన్లలోని పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కెపాసిటీ పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. స్థలాల కొరతను అధిగమించడం కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలాలను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు సాంకేతికంగా చర్యలు తీసుకున్నామన్నారు. దానిలో భాగంగా సంస్థ పరిధిలో మొట్టమొదటిసారిగా 1000 కేవీఏ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 70 శాతానికి మించి లోడ్‌ ఎదుర్కొనే 500 కేవీఏ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 1000 కేవీఏ కెపాసిటీ ఉన్న డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 33/11 కేవీ సబ్‌ స్టేషన్ల పరిధిలో ముఖ్యంగా గ్రేటర్‌ పరిధిలో ఉన్న సబ్‌ స్టేషన్లలో గరిష్ట కెపాసిటీ కలిగిన 16 ఎంవీఏ పీటీఆర్‌ (పవర్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌) లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పెద్ద కెపాసిటీ కలిగిన ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వల్ల స్థలాల కొరత చాలా వరకు తగ్గుతుందని తెలిపారు. డిమాండ్‌ పెరగనున్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్ర స్థాయి అధికారులతో సమావేశమై క్షుణ్ణంగా పరిశీలించి వారం రోజుల్లో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఈ నెల చివరి వరకు రిపేర్‌ అండ్‌ మెయింటనెన్స్‌ పనులకు సంబంధించిన పనులను మొదలు పెట్టాలని సూచించారు ఈ పనులన్నీ డిసెంబర్‌ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌ కో డైరెక్టర్లు సంపత్‌ కుమార్‌, లతా వినోద్‌, దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ డైరెక్టర్లు డాక్టర్‌ నరసింహులు, శివాజీ, ట్రాన్స్‌ కో చీఫ్‌ ఇంజినీర్లు చిరంజీవి, వాసుదేవ రావు, డిస్కం చీఫ్‌ ఇంజినీర్లు పాండ్య, నరసింహ స్వామి, బాల స్వామి, ఆనంద్‌, కామేష్‌, ప్రభాకర్‌, ఇతర సూపరింటెండింగ్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -