Wednesday, April 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంశ్రీశైలంలో ఏపీ విద్యుత్‌ ఉత్పత్తి నిబంధనలకు విరుద్ధం

శ్రీశైలంలో ఏపీ విద్యుత్‌ ఉత్పత్తి నిబంధనలకు విరుద్ధం

- Advertisement -

తెలంగాణ నీటివాటాల విషయంలో రాజీపడం : మంత్రి జూపల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

శ్రీశైలం రిజర్వాయర్‌లో కనిష్ట నీటిమట్టం స్థాయి 834 అడుగుల( 254.2 మీటర్లు)కు దిగువకెళ్లినప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి చేయకూడదనే నిబంధనలకు పాతరేసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి కేటాయింపుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలు పట్టించుకోకుండా ఏపీ సర్కార్‌ అక్రమంగా నీటిని తోడేస్తున్నదని విమర్శించారు. ఈ అంశంపై ఎన్నిసార్లు విన్నవించినా ఏపీ సర్కార్‌ పట్టించు కోలేదన్నారు. అందుకే ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా రైతాంగం, అదే విధంగా కృష్ణా పరివాహక ప్రాంత జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రజాప్రతినిధులం శ్రీశైలం వద్ద వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చామని తెలిపారు. తమ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపేసిందన్నారు. ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. పాలమూరు జిల్లాకు నష్టం జరిగితే రైతు పక్షాన తమ ప్రభుత్వం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలను పునరావృతం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం హైకోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -