Monday, March 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమళ్ళీ మాదే అధికారం

మళ్ళీ మాదే అధికారం

- Advertisement -

సిద్దిపేటలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే మంత్రి పదవి
రూ.3500 కోట్ల రైతు భరోసా విడుదల
ఎగుమతులు చేసే స్థాయికి రైతులు ఎదగాలి
వ్యవసాయమూ తెలుసు.. చీడపీడలకు ఏ మందు వేయాలో తెలుసు
అన్ని నియోజకవర్గాల్లో సమానంగా అభివృద్ధి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నర్మెట్టలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభం, రైతు ఉత్సవాల సభ
వంట నూనె రిఫైనరీ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన

నవతెలంగాణ- మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
”రైతులు ఒకే విధంగా పంటలు వేయకుండా పంటల మార్పిడి చేసుకోవాలి.. దానివల్ల పంటలు పుష్కలంగా పండి ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటారు. వాణిజ్య పంటల సాగువైపు మళ్లాలి. రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నాం.. రాష్ట్రంలోని 73 లక్షల మంది రైతులకు ఈ పెట్టుబడి సాయం అందనుంది. రైతు పక్షపాతిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుంది” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నర్మెట్ట గ్రామంలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్‌పామ్‌ పరిశ్రమను ఆదివారం మంత్రులతో కలిసి ప్రారంభించారు.అక్కడే నిర్మించతలపెట్టిన వంటనూనె రిఫైనరీ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు ఉత్సవాల బహిరంగ సభలో రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేశారు. ఇవాళ బ్యాంకులకు సెలవు దినం కావడంతో రైతుల ఖాతాల్లో రేపు డబ్బులు జమ కానున్నాయి.

తొలి విడతగా ఎకరంలోపు ఉన్న రైతులకు రూ.3,600కోట్లు ఖాతాల్లో జమకానున్నాయని, ఆ తర్వాత రెండో విడతలో రూ.2,650 కోట్లు, చివరి విడత గా రూ.2,760 కోట్లు విడుదల చేయను న్నామని తెలిపారు. మొత్తం 45 రోజుల్లో రైతు భరోసా కింద 9వేల కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు.రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతోపాటు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని తెలిపారు. గతంలో కేసీఆర్‌ హయాంలో రైతుల కోసం ప్రతినెలా రూ.2533 కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం 28 నెలల్లో ప్రతి నెలా రూ.5500 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేస్తోందని చెప్పారు. తుఫాన్‌కి కామారెడ్డి ప్రాంతాల్లోని పొలాల్లో ఇసుక మేటలు వేశాయని, పంట నష్టం జరిగితే ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇచ్చామని అన్నారు. ఈ 28 నెలల్లో రైతుల కోసం లక్షా 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు.

రైతులు వాణిజ్య పంటల వైపు వెళ్లాలి..
ఒకప్పుడు క్వింటాల్‌ పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేది, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని సీఎం అన్నారు. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేయాలని సూచించారు. రైతులు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపాలని, రంగారెడ్డి జిల్లా చుట్టూ ఒకప్పుడు పాడి పరిశ్రమ, పండ్ల తోటలు ఉండేవని, ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌తో అవన్నీ కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట మార్పిడి కోసం రైతులు పూనుకోవాలని, మిల్లెట్స్‌, ఆకు కూరలు లాంటి పంటలు పండించాలని సూచించారు.

ప్రయివేటు మోజు వద్దు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్ద రైతు.. వ్యవసాయం గురించి ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చని, ఆయన వ్యవసాయశాఖ మంత్రిగా ఉండటం మన అదృష్టమని ముఖ్యమంత్రి అన్నారు. పంట మార్పిడి కోసం కృషి చేయాలని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి ప్రధానిని కలుస్తామన్నారు. మహిళల కోసం సోదరుడిగా నిలబడుతానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో అత్యుత్తమ శిక్షణ పొందిన టీచర్లు లక్ష మందికిపైగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకున్నామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు.

నర్సరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ప్రారంభించడమే కాకుండా విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ప్రయివేట్‌ మోజులో పడొద్దు.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేస్తే ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదు కానీ ఏటీసీ (అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు)లో చదువుకుంటే ఉద్యోగం కల్పించే బాధ్యత తనది అని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏటీసీల్లో చదివే విద్యార్థులకు ప్రతినెలా రూ.2వేల చొప్పున స్కాలర్‌షిప్‌ ఇస్తామని తెలిపారు.

సిద్దిపేటలో అవకాశం ఇవ్వాలి
2029లోనూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలోకి రాబోతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్‌ గెలవాలని, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేను మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేటను 1984 నుంచి ఒకే కుటుంబం పాలిస్తోందని ఒక్కసారి ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్‌లా తాము వ్యవహరించడం లేదని, నారాయణపేట కొడంగల్‌ ప్రాజెక్టు నిర్వాసితులను ఒప్పించాకే పనులు ప్రారంభించామని తెలిపారు.

”మూసీలో మీ మొసలి కన్నీరు ప్రజలు అర్థం చేసుకోవడం లేదనుకుంటున్నారా? అభివృద్ధి జరగకుండా అడ్డం పడుకుంటామంటే ఊరుకుంటామా? ముఖ్యమంత్రినై సిద్దిపేటకు రాలేదా? 2029లో మళ్లీ గెలిచి సిద్దిపేటకు వస్తామ”ని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుతో రాజకీయంగా తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. కానీ వారి నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ నిజాయితీ నిరూపించుకుంటున్నామని చెప్పారు. నర్మెట్ట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ పనులు తాను ముఖ్యమంత్రి అయ్యాకే ప్రారంభమయ్యాయని చెప్పారు. నిధుల విషయంలో తానేమీ వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు.

కావాలంటే.. 2014 నుంచి 2023 వరకు కొడంగల్‌కు ఎన్ని నిధులు ఇచ్చారు? తామొచ్చాక ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు ఇచ్చామో లెక్కలు తీద్దామని హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు. పేదల కోసం పని చేస్తాం తప్ప రాజకీయ నాయకుల కోసం తాము పని చేయబోమని చెప్పారు. తనకు వ్యవసాయం తెలుసని, చీడపురుగులకు ఏ మందు వేయాలో బాగా తెలుసునని అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -