Saturday, May 24, 2025
Homeప్రధాన వార్తలుఅధికారమే పరమావధి..!

అధికారమే పరమావధి..!

- Advertisement -

– కాంగ్రెస్‌పైనే నేరుగా ఎటాక్‌
– బీజేపీపై మాట్లాడింది రెండు నిమిషాలే
– డీలిమిటేషన్‌పై నోరెత్తని కేసీఆర్‌
– రాష్ట్రాల హక్కుల హరణ, విభజన రాజకీయాల ఊసే లేదు
 – ప్రసంగంలోనూ కనిపించని తీవ్రత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆ పార్టీ రజతోత్సవ సభలో డీలిమిటేషన్‌పై పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడం చర్చనీయాంశమవుతున్నది. నియోజకవర్గాల విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగబోతుందనే చర్చ నేపథ్యంలో సభలో కేసీఆర్‌ మాట్లాడుతారనీ, కేంద్రం తీరును ఎండగడుతారని అందరూ ఊహించారు. కానీ, ఈ విషయంపై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. గంటకుపైగా సాగిన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై ఆయన రెండు నిమిషాలే మాట్లాడారు. అందులోనూ ఆపరేషన్‌ కగార్‌ గురించే ఎక్కువ ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నేరుగా ఎక్కడ కూడా అటాక్‌ చేయలేదు. ఏదో నామకే వాస్తుగా ’11 ఏండ్లలో 11 రూపాయలివ్వలేదు.. సీలేరు గుంజుకున్నరు..ఏడు మండలాలు లాక్కున్నారు…తల్లిని చంపి బిడ్డను వేరు చేసినట్టు తెలంగాణ ఇచ్చారు..’ అనే మాటలకే పరిమితమయ్యారనే వాదన వినిపిస్తున్నది. బీజేపీ పాలనలో రాష్ట్రాల హక్కుల హరణ, రాజ్యాంగంపై పెరుగుతున్న దాడి, విద్వేష రాజకీయాల గురించి మాట్లాడలే దు. డీలిమిటేషన్‌పైనా, బీజేపీ విధానాలపైనా బీఆర్‌ఎస్‌ వైఖరేంటి? అనేదానిపై అధ్యక్షుని హోదాలో బహిరంగ సభలో స్పష్టతనివ్వలేదు. కాళేశ్వరంపై నేషనల్‌ డ్యామ్‌ సేప్టీ అథారిటీ నివేదిక రావడం, మద్యం కేసులో కవిత ఉండటం, ఇతరత్రా కేసులు వేధిస్తున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీతో విభేదాలెందుకు? అన్న ధోరణిలో బీఆర్‌ఎస్‌ అధినేత ఉన్నట్టు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘ఆనాడైనా.. ఈనాడైనా తెలంగాణకు కాంగ్రెస్సే విలన్‌’ అంటూ హస్తం పార్టీనే టార్గెట్‌ చేశారు. కేసీఆర్‌ తన ప్రసంగంలో రేవంత్‌ సర్కార్‌పైనా, కాంగ్రెస్‌ పార్టీపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. దొంగ గాంధీలు వచ్చి హామీలిచ్చారంటూ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. రాహుల్‌గాంధీపై ఈ విమర్శలను పదేపదే బీజేపీ నేతలు చేస్తూ వస్తున్న విషయం విదితమే. వయోభారం రీత్యానో…ఇతరత్రా కారణాల వల్లనో గానీ ఆయన స్పీచ్‌లో గతంలో మాదిరిగా తీవ్రత కనిపించలేదు. సభలు అంటే చాలు నోటిమీద లెక్కలు, సామెతలు, ఉదహరణలతో ఇతర పార్టీలను దునుమాడుతూ అనర్గళంగా మాట్లాడే కేసీఆర్‌ ప్రస్తుత సభలో రాసిచ్చిన స్క్రిప్టు ముందు పెట్టుకుని మాట్లాడటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -