Saturday, December 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజల్లో ఉంటేనే అధికారం

ప్రజల్లో ఉంటేనే అధికారం

- Advertisement -

– రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం
– యూపీలో బీజేపీ రెండోస్థానం
– త్వరలో కేసీఆర్‌తో సమావేశం
– ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌
– యూపీలో పార్లమెంటు ఫలితాలు మాకు స్ఫూర్తి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రజల్లో నిత్యం ఉంటేనే ఏ పార్టీకైనా అధికారం తప్పకుండా వస్తుందని సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధినేత, ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌)ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మాజీమంత్రులు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారుతాయనీ, నిరంతరం ప్రజలతో ఉంటే బీఆర్‌ఎస్‌కు ప్రజలు తిరిగి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడితే, వారు తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని చెప్పారు. ఎన్నికల్లో జయాపజయాలు ఉంటాయని వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ ప్రస్థానాన్ని ఉదహరిస్తూ.. ‘గతంలో మేం కూడా చాలా తక్కువ సీట్లు గెలిచాం. కానీ ప్రజల వెంటే మేమున్నాం. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు మాకు అండగా నిలిచారు. వారి మద్దతుతోనే నేడు యూపీలో బీజేపీని రెండో స్థానానికి నెట్టాం. 37 మంది ఎంపీలతో లోక్‌సభలో బలంగా ఉన్నాం. ప్రజలు ఎప్పుడు ఎవరికి అండగా నిలబడతారో ఎవరూ ఊహించలేరు. ప్రజల వెంట ఉంటే వారే మనకు అవకాశాన్ని ఇస్తారు.’అని అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. పాలకులకు విజన్‌ ఎంతో అవసరమని చెప్పారు. దేశానికి ప్రగతిశీల రాజకీయాలు కావాలన్నారు. ప్రజలు విభజించి రాజకీయాలు చేసే పద్ధతికి స్వస్తి పలకాలని చెప్పారు. రాజకీయాల్లో ప్రతికూలత పోవాలనీ, అభివృద్ధి, సానుకూల దృక్పథంతో కూడిన ప్రగతిశీల రాజకీయాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. త్వరలోనే కేసీఆర్‌తో సమావేశమవుతానని అన్నారు.
యూపీలో ఎస్పీ అద్భుత విజయం : కేటీఆర్‌
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ, పార్లమెంటు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా ఎస్పీని నిలబెట్టిన అఖిలేశ్‌ యాదవ్‌ స్ఫూర్తిదాయకమని కేటీఆర్‌ చెప్పారు. 37 ఎంపీ స్థానాలను గెలిచారని అన్నారు. అదే స్ఫూర్తితో బీఆర్‌ఎస్‌ భవిష్యత్తులో ముందుకు సాగుతుందన్నారు. ప్రజల వెంట నిలబడి మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అఖిలేశ్‌ యాదవ్‌ మరోసారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు కేసీఆర్‌తో సమావేశమవుతారని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -