– సంధ్య కన్వెన్షన్ ఎమ్‌డీ ఇంప్లీడ్ కొట్టివేత
– ఫోన్‌ట్యాపింగ్ కేసులో హైకోర్టు తీర్పు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి ప్రభాకర్‌రావు ముందస్తు బెయిలు పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. అలాగే ఇందులో తననూ ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలంటూ సంధ్య కన్వెన్షన్ ఎండీ ఎస్ శ్రీధర్‌రావు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌నూ కొట్టివేసింది. ప్రభాకర్‌రావు ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారించిన జస్టిస్ జే శ్రీనివాసరావు ఈమేరకు శుక్రవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావులు వాదనలు వినిపిస్తూ కేసు నమోదయ్యాక విచారణ నుంచి పారిపోయాడని చెప్పారు. ఎన్నికల ఫలితాల అనంతరం డేటాను ధ్వంసం చేశారనీ, గత ప్రభుత్వంలోని రాజకీయ నేతల అవసరాల మేరకు పిటీషనర్ పనిచేశారన్నారన్నారు. పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, న్యాయమూర్తులతోపాటు ప్రయివేటు వ్యక్తుల ఫోన్‌లపై నిఘాపెట్టి, వారి కదలికలపై సమాచారం చేరవేసేవారన్నారు. ఫోన్ ట్యాపింగ్ నేరంలో పిటిషనర్ సూత్రధారిగా వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే కీలక సమాచారం ఉన్న హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేశారన్నారు. శ్రవణ్‌రావుకు సుప్రీం కోర్టు ఇచ్చిన రక్షణ తాత్కాలికమేననీ, అది ఎప్పుడైనా రద్దు కావచ్చన్నారు. శ్రవణ్‌రావు ప్రయివేటు వ్యక్తి అనీ, పిటీషనర్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని వాదించారు. గత ప్రభుత్వ పెద్దల నుంచి ఫోన్‌లు వచ్చాయని, వీటన్నింటి గురించి సమాచారం రాబట్టడానికి కస్టోడియల్ విచారణ అవసరమని, ముందస్తు బెయిలు పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. శ్రవణ్‌రావుకు సుప్రీం కోర్టు ఇచ్చిన రక్షణను ఇక్కడ కోరరాదని న్యాయస్థానానికి చెప్పారు.
గ్రూప్-1కేసులో మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
గ్రూప్-1 ఎవాల్యుయేషన్‌లో అవకతవకలపై విచారణ జరిపించాలంటూ దాఖలైన 4 పిటిషన్‌లపై విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాదనలు పూర్తికాకపోవడంతో విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేశారు. అప్పటిలోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలన చేసుకోవచ్చనీ, నియామక పత్రాలు జారీ చేయరాదని గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని ప్రకటించారు. మూల్యాంకనంలో అవకతవకల ఆరోపణలకు ప్రధాన కారణమైన అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రాలను సమర్పించాలని టీజీపీఎస్సీకి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తుచేయగా మార్కులు తగ్గిపోయాయంటూ పూజితారెడ్డి చెప్పగా, మరోవైపు మొదటి నుంచి మార్కుల్లో తేడా లేదని, మార్కుల జాబితాను పూజితారెడ్డి తారుమారు చేశారని టీజీపీఎస్సీ ఆరోపించడంతో ఆ అభ్యర్థి జవాబు పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. తొలుత పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, టీజీపీఎస్సీ తరఫు న్యాయవాదుల వాదనలు ధాటిగా జరిగాయి. పిటిషనర్లు కావాలనే కాలయాపన చేస్తున్నారనీ, రెండ్రోజులుగా చెప్పినవే చెబుతున్నారంటూ టీజీపీఎస్సీ న్యాయవాది చెప్పారు. ప్రస్తుతం పిటిషనర్లు అందరూ ఉద్యోగంలో ఉన్నవారేననీ, మిగిలినవారికి ఉద్యోగాలు రాకుండా చూస్తున్నారన్నారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాదనల్లో పదే పదే అడ్డుతగలడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఇది కొన్ని వేల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశమని, వాదనల్లో చెప్పినవి చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతేగాకుండా ఇలాంటి కేసుల్లో నిర్దిష్ట సమయం పెట్టుకుని తేల్చలేమని చెప్పారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ, పరీక్షల నిర్వహణలో మొదటి నుంచి టీజీపీఎస్సీ ఒకదాని తరువాత మరొకటి తప్పులు చేస్తూనే వస్తుందన్నారు. ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టిక్కెట్‌లు కేటాయించడంతో తప్పులు మొదలయ్యాయన్నారు. తరువాత సెంటర్లను కేటాయించడంలోనూ అదే అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. కోఠి మహిళా కళాశాలలో మహిళలనే కేటాయించామంటూ కావాల్సిన అభ్యర్థులను కేటాయించిందన్నారు. అనంతరం వాల్యుయేటర్ల ఎంపికలోనూ పారదర్శకంగా లేదన్నారు. ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నారని టీజీపీఎస్సీ చెబుతున్న వ్యక్తి ప్రయివేటు సంస్థలో పనిచేస్తున్నారనీ, అక్కడి నుంచి వేతనం పొందారన్నారు. దాదాపు 40 శాతం మంది తెలుగులో పరీక్ష రాశారని, 10 నుంచి 12 శాతం ఉర్దూలో, మిగిలిన వారు ఆంగ్లంలో పరీక్ష రాశారన్నారు. అయితే వాల్యుయేటర్లలో ఎంత మంది తెలుగువారున్నారో వెల్లడించలేదన్నారు. తెలుగు మాట్లాడటం వేరు తెలుగు భాష వచ్చి ఉండటం వేరు అన్నారు. కోఠి మహిళా కళాశాలలోని 18వ సెంటరులో 721 మంది పరీక్ష రాస్తే 39 మంది, అందులోనే 19వ సెంటరులో 776 మందికి 32 మంది ఎంపికయ్యారన్నారు. అంటే మొత్తం 563 మందిలో సుమారు 12 శాతం ఉన్నారన్నారు. తెలుగు వాళ్లకే మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయన్నారు. మూల్యాంకనం రెండోసారి జరిపి 15 శాతం తేడా ఉంటే మూడో మూల్యాంకనం జరుగుతుందని చెబుతున్నారనీ దీన్ని ఆప్టికల్ మెషిన్ రీడర్‌తో డేటా ఎందుకు భద్రపరచలేదన్నారు. అలాంటప్పుడు మార్కుల కేటాయింపు ఎలా జరిగిందో ఎవరికి తెలుస్తుందని ప్రశ్నించారు. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ తదుపరి విచారణనాటికి మార్కుల జాబితాను తారుమారు చేసిందంటున్న పూజితారెడ్డి జవాబు పత్రాలను సీల్డ్ కవర్‌లో సమర్పిస్తామని, దాన్ని పరిశీలిస్తే పిటిషనర్ల అనుమానాలకు తెరపడుతుందన్నారు. గ్రూప్-1 మెయిన్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ 19 మంది పిటిషన్ దాఖలు చేయగా, అందులో తన పేరును తొలగించాలంటూ సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న షబ్నం ఆర్య జ్యుడిషియల్ రిజిస్ట్రార్‌కు లేఖ రాసారు. అయితే దీన్ని ఈ దశలో అనుమతించలేమని న్యాయమూర్తి చెప్పడంతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఎస్సీ, ఎస్టీ కేసు వివరాలివ్వండి : సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ గచ్చిబౌలిలో 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు కింది కోర్టులో ఏ దశలో ఉందో చెప్పాలంటూ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గోపన్నపల్లిలో సర్వే నెం.127లోని 31 ఎకరాలకు సంబంధించి హక్కుల వివాదంలో ఎస్సీ మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి, రేవంత్‌రెడ్డి సోదరుడు ఎ.కొండల్‌రెడ్డి, ఎ.లక్ష్మయ్యల మధ్య వివాదంలో భాగంగా అప్పట్లో ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతో సొసైటీకి చెందిన స్థలంలోకి అక్రమంగా జొరబడ్డారని, అడ్డుకున్న తనపై కులం పేరుతో దూషించారంటూ ఎన్.పెద్దిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి 2019లో కింది కోర్టులో అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. కింది కోర్టులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులను కొట్టివేయాలంటూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ మౌసమీ భట్టాచర్య విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతివాది అయిన పెద్దిరాజు తరఫు న్యాయవాది నిమ్మ నారాయణ వాదనలు వినిపిస్తూ 2019లో అభియోగ పత్రం దాఖలు చేసినా, ఇప్పటివరకు అభియోగాలు నమోదు చేయలేదన్నారు. 2019 జులైలో రెండుసార్లు కోర్టు ముందుకు విచారణకు వచ్చిన కేసు, ఆ తర్వాత 2025 జనవరి 31న, ఏప్రిల్ 21న వచ్చిందన్నారు. రేవంత్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపిస్తూ కేసులో పిటిషనర్ పాత్ర లేకపోయినా రాజకీయ కక్షసాధింపుతో కేసు పెట్టారన్నారు. విచారణలో తన ప్రమేయం లేదన్నారు. ఇరుపక్షాల వాదన విన్న న్యాయమూర్తి కింది కోర్టులో విచారణ ఏ దశలో ఉందో పూర్తి వివరాలు, పత్రాలతో సమర్పించాలని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాదికి ఆదేశిస్తూ విచారణను జూన్ 13కు వాయిదా వేశారు.
హైకోర్టుకు సెలవులు
హైకోర్టుకు ఈనెల 5 నుంచి జూన్ 6వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మే 7, 14, 21, 28, జూన్ 4వ తేదీల్లో కోర్టులు కేసుల విచారణ చేపడతాయన్నారు. విచారణ తేదీకి రెండ్రోజుల ముందు పిటిషన్‌లను ఫైలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. మే 7న జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో బెంచ్, జస్టిస్ పుల్లా కార్తీక్ సింగిల్‌గా విచారణ చేపడతారన్నారు. మే 14న జస్టిస్ పుల్లా కార్తీక్, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావుల బెంచ్, జస్టిస్ జె.శ్రీనివాసరావు సింగిల్, మే 21న జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావులతో బెంచ్, జస్టిస్ జె.శ్రీనివాసరావు సింగిల్, మే 28న జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన బెంచ్, జస్టిస్ కె.శరత్ సింగిల్, జూన్ 4న జస్టిస్ కె.శరత్, జస్టిస్ బి.ఆర్.మధుసూదన్‌రావులతో కూడిన బెంచ్, జస్టిస్ కె.సుజన సింగిల్ బెంచ్‌ల్లో విచారణ చేపడతారన్నారు. హెబియస్ కార్పస్, ముందస్తు బెయిల్, కూల్చివేతలు తదితర అత్యవసర కేసులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు.
ప్రభాకర్‌రావు ముందస్తు బెయిలు పిటిషన్ కొట్టివేత
- Advertisement -
RELATED ARTICLES