నవతెలంగాణ-హైదరాబాద్: రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభాకర్‌రావు బెయిల్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తునకు సంబంధించి స్టేటస్ రిపోర్టు దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు.
ఎన్నిసార్లు పిలిచినా దర్యాప్తునకు హాజరవుతున్నట్లు ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది శేషాద్రి నాయుడు తెలిపారు. ప్రభాకర్‌రావు ఇచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఫార్మాట్ చేసి ఇచ్చారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌టాప్ కూడా అదే స్థితిలో ఉందని, దానిలో ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దర్యాప్తునకు సహకరించాలని ప్రభాకర్‌రావును ఆదేశించింది.