ఫిడె చెస్ ప్రపంచ ర్యాంకింగ్స్
లసానె (స్విట్జర్లాండ్) : ఇటీవల సింక్వెఫీల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద ఫిడె ప్రపంచ చెస్ ఓపెన్ ర్యాంకింగ్స్‌లో కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. సింక్వెఫీల్డ్ ప్రదర్శనతో ఆరు రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్న ప్రజ్ఞానంద వరల్డ్ నం.4గా నిలిచాడు. క్లాసికల్ ఫార్మాట్‌లో భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్ చెస్ ఆటగాడు ప్రజ్ఞానంద కావటం విశేషం. తెలంగాణ స్టార్ అర్జున్ ఇరిగేశి 2771 ఎలో రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానంలోనే కొనసాగుతున్నాడు. ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ 2767 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. నార్వే స్టార్ కార్ల్‌సన్ మాగస్ 2839 ఎలో రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్లు హికారు నకముర (2807), ఫాబియానో కారువానా (2789) వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచారు. ప్రపంచ టాప్-6 ర్యాంకర్లలో ముగ్గురు భారత గ్రాండ్‌మాస్టర్లు ఉండటం విశేషం. మహిళల విభాగంలో తెలుగు తేజం కోనేరు హంపీ (2535) ఐదో స్థానంలో నిలువగా.. మహిళల ప్రపంచకప్ విజేత దివ్య దేశ్‌ముఖ్ (2478) 14వ స్థానంలో కొనసాగుతుంది.