Thursday, May 22, 2025
Homeఆటలుప్రణయ్ ఫటాఫట్‌

ప్రణయ్ ఫటాఫట్‌

- Advertisement -

– ఐదో సీడ్‌ నిషిమోటపై మెరుపు విజయం
– తొలి రౌండ్లోనే సింధుకు చుక్కెదురు
– మలేషియా మాస్టర్స్‌ ఓపెన్‌ 2025

హెచ్‌.ఎస్ ప్రణయ్ సంచలన విజయం సాధించాడు. ఇటీవల పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న భారత వెటరన్‌ షట్లర్‌ మలేషియా మాస్టర్స్‌ ఓపెన్‌లో అదరగొట్టాడు. జపాన్‌ స్టార్‌, ఐదో సీడ్‌ కెంటో నిషిమోటపై మూడు గేముల పోరులో విజయం సాధించాడు. భారత అగ్రశ్రేణి షట్లర్‌, ఒలింపిక్స్‌లో రెండు సార్లు పతకాలు సాధించిన పి.వి సింధుకు మరోసారి నిరాశ తప్పలేదు. తెలుగు తేజం తొలి రౌండ్లోనే నిష్క్రమించింది.
నవతెలంగాణ-కౌలాలంపూర్‌
భారత బ్యాడ్మింటన్‌కు ఈ సీజన్‌లో తొలిసారి ఓ టోర్నమెంట్‌లో అదిరే ఆరంభం దక్కింది. మలేషియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్‌ మాజీ వరల్డ్‌ నం.2, రెండు సార్లు ఒలింపిక్స్‌ పతకాల విజేత పి.వి సింధుకు నిరాశ ఎదురైనా.. పురుషుల సింగిల్స్‌లో వెటరన్‌ షట్లర్లకు తోడు ఓ యువ షట్లర్‌ సైతం సూపర్‌ విక్టరీ సాధించాడు. హెచ్‌.ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లో ఐదో సీడ్‌ జపాన్‌ ఆటగాడిపై విజయం సాధించగా.. యువ ఆటగాడు సతీశ్‌ కరుణాకరన్‌ మూడో సీడ్‌ చైనీస్‌ తైపీ షట్లర్‌ను మట్టికరిపించాడు. ప్రణయ్, సతీశ్‌లతో పాటు మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ సైతం మెన్స్‌ సింగిల్స్‌లో ముందంజ వేశాడు.
అదిరే విజయాలు
2023 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ కాంస్య పతక విజేత హెచ్‌.ఎస్ ప్రణయ్ ఎటువంటి అంచనాలు లేకుండా మలేషియా ఓపెన్‌ బరిలోకి దిగాడు. తొలి రౌండ్లోనే భీకర ఫామ్‌లో ఉన్న జపాన్‌ షట్లర్‌, ఐదో సీడ్‌ కెంటో నిషిమోటతో పోరు కావటంతో సహజంగానే ప్రణయ్ పై ఆశలు లేవు. ఒక గంట, 22 నిమిషాల పాటు ఉత్కంఠగా సాగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ప్రణయ్ పైచేయి సాధించాడు. 19-21, 21-17, 21-16తో జపాన్‌ షట్లర్‌ను చిత్తు చేశాడు. తొలి గేమ్‌లో 11-10తో గట్టి పోటీనిచ్చిన ప్రణయ్.. 18-18 వరకు పోటీలో నిలిచాడు. 19-21తో తొలి గేమ్‌లో ఓడిన ప్రణయ్.. రెండో గేమ్‌ నుంచి ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. రెండో గేమ్‌లోనూ విరామ సమయానికి 10-11తో ఓ పాయింట్‌ వెనుకంజలో నిలిచిన ప్రణయ్ ద్వితీయార్థంలో పుంజుకున్నాడు. 17-17 వద్ద నిషిమోటను నిలువరించి 21-17తో రెండో గేమ్‌ను గెల్చుకున్నాడు. దీంతో మ్యాచ్‌ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు దారితీసింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆరంభం నుంచీ నిషిమోట దూకుడు చూపించాడు. 6-11తో ఐదు పాయింట్ల వెనుకంజలో నిలిచిన ప్రణయ్.. విరామం తర్వాత గొప్పగా పుంజుకున్నాడు. వరుస పాయింట్లతో 12-12 వద్ద స్కోరు సమం చేశాడు. 15-15 వరకు నిషిమోట రేసులో నిలిచినా.. ఆ తర్వాత ప్రణయ్ ఊపందుకున్నాడు. 21-16తో మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. నేడు రెండో రౌండ్‌ మ్యాచ్‌లో జపాన్‌ షట్లర్‌ యుషి తనకతో ప్రణయ్ తలపడనున్నాడు.
వరల్డ్‌ నం.51 సతీశ్‌ కరుణాకరన్‌ తొలి రౌండ్లో వరల్డ్‌ నం.7 చో టిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)పై 21-13, 21-14తో వరుస గేముల్లో అలవోక విజయం సాధించాడు. 39 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సతీశ్‌ అద్భుతంగా రాణించాడు. మరో మ్యాచ్‌లో వరల్డ్‌ నం.13, ఆరో సీడ్‌ లు జాంగ్‌ జుపై 23-21, 13-21, 21-11తో కిదాంబి శ్రీకాంత్‌ మెరుపు విజయం సాధించాడు. యువ షట్లర్‌ ఆయుష్‌ శెట్టి 20-22, 21-10, 21-8తో బ్రయాన్‌ యాంగ్‌ (కెనడా)పై గెలుపొంది ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు 11-21, 21-14, 15-21తో మూడు గేముల మ్యాచ్‌లో వియత్నాం షట్లర్‌ చేతిలో ఓటమి పాలైంది. 12-21, 20-22తో ఉన్నతి హుడా..9-21, 8-21తో ఆకర్షి కశ్యప్‌.. 21-19, 18-21, 8-21తో మాళవిక బాన్సోద్‌లు తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -