Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅంగన్‌వాడీల ముందస్తు అరెస్టులు

అంగన్‌వాడీల ముందస్తు అరెస్టులు

- Advertisement -

– చలో హైదరాబాద్‌కు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
– నిరసనగా జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు
– ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం
నవతెలంగాణ- విలేకరులు

సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి బయలుదేరిన అంగన్‌వాడీ కార్యకర్తలను, సీఐటీయూ నాయకులను సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇండ్ల వద్దకే వెళ్లి అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టులను నిరసిస్తూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సీఐటీయూ కార్యాలయం నుంచి బస్టాండ్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్‌ సెంటర్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. మణుగూరులో ర్యాలీ, అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. అశ్వారావుపేటలో ఐసీడీఎస్‌ కార్యాలయం రికార్డ్‌ అసిస్టెంట్‌ కిరణ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. చర్లలో నిరసన ర్యాలీ, అంబేద్కర్‌ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. దమ్మపేటలో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, తహసీల్దార్‌కి వినతి పత్రం అందజేశారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు, ఆమనగల్‌ మండలాల్లో సీపీఐ(ఎం), సీఐటీయూ, అంగన్‌వాడీలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వనపర్తి జిల్లా పరిధిలోని వీపనగండ్ల పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలు సుగుణ, బారు రాధా, మాధవి, సువర్ణను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషను తరలించారు. నారాయణపేట జిల్లాలో మద్దూర్‌, మక్తల్‌, నారాయణపేట ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీల ఇండ్ల దగ్గరికి వెళ్లి పోలీసులు అరెస్టులు చేశారు.
మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు, కార్యకర్తలను పోలిస్‌లు తెల్లవారుజామునే అరెస్టు చేశారు. ఇనుగుర్తి మండల కేంద్రం చిన్న బస్టాండ్‌ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. గూడూరు మండలంలో అంగన్‌వాడీ టీచర్లను, సీఐటీయూ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కేసముద్రం మున్సిపాలిటీలోని మహాత్మ జ్యోతిరావు పూలే సెంటర్‌లో నిరసన తెలిపారు.
ఆసిఫాబాద్‌లో అంగన్‌వాడీల అక్రమ అరెస్ట్‌లను సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్‌ ఖండించారు. మండల కేంద్రాల్లో నిరసనలు తెలిపారు. నిర్మల్‌లో అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలి అరెస్టును సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్‌ ఒక ప్రకటనలో ఖండించారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న అంగన్‌వాడీలను అరెస్టు చేయడం సరికాదన్నారు. అంగన్‌వాడీల అరెస్టులను ఖండిస్తూ ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -