18న మహిళా విధాన రూపకల్పనపై సమావేశం: బాలల దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ప్రి ప్రైమరీ బోధన నుంచి పోషకాహారం వరకు సంపూర్ణ బాధ్యత ప్రభుత్వానిదేనని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులతో కలిసి బెలూన్లు ఎగురవేసి వేడుకలను ఆమె ప్రారంభించారు. చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు స్వయంగా అందించి, వారిని ప్రేమగా చేరదీసి అక్కడి వాతావరణాన్ని మరింత ఉల్లాసభరితంగా మార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం కోసం జీవితాన్ని అర్పించిన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచనలు, నైతిక విలువలు నేటి తరానికి మార్గదర్శకాలని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం నూతన విధానాన్ని రూపొందించే క్రమంలో నిపుణులు, మేధావులతో ఈ నెల 18న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి వివరించారు.
అనంతరం చిన్నారుల ఆటపాటలు, సాంస్కతిక ప్రదర్శనలు ఆసక్తిగా వీక్షించి వారి ప్రతిభను మెచ్చుకున్నారు. శిశువిహార్‌తో పాటు వివిధ అనాధాశ్రమాల్లో ఉంటూ చదువులో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు కన్చర్ల వందన గౌడ్, మరిపల్లి చందన, బండి అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్, బి.వచన్‌కుమార్, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా పాల్గొన్నారు.



