Tuesday, September 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅన్ని సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించాలి

అన్ని సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించాలి

- Advertisement -

విద్యాకమిషన్‌ చైర్మెన్‌కు పీఆర్టీయూటీఎస్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించాలని పీఆర్టీయూటీఎస్‌ కోరింది. సోమవారం హైదరాబాద్‌ నారాయణగూడలో ఉన్న పీఆర్టీయూటీఎస్‌ కార్యాలయాన్ని విద్యా కమిషన్‌ చైర్మెన్‌ ఆకునూరి మురళి, ఇతర సభ్యులు సందర్శించారు. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వారికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో విద్యావ్యస్థ బలోపేతం గురించి అనేక అంశాలు ముఖ్యంగా పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్య పెంపునకు తీసుకునే చర్యలు, విద్యార్థి అభ్యాసన ఫలితాలు, పెరుగుదలతోపాటు మధ్యాహ్న భోజన పథకం, పూర్వ ప్రాధమిక పాఠశాలల ఏర్పాటు, ప్రాధమిక పాఠశాలల్లో తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు వంటి అనేక అంశాలు చర్చించారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించి విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదికి ఒక టీచర్‌ను నియమించి పర్యవేక్ష గురించి పీఎస్‌హెచ్‌ఎం పోస్టు ఉండేలా చూడాలని సూచించారు. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో 12వ తరగతి వరకు పెంచి పెరిగిన తరగుతులకు అనుగుణంగా తగిన ప్యాట్రన్‌లో పోస్టులు ఇవ్వాలని తెలిపారు.

పాఠశాలల్లో ఏకరూప దుస్తులు ప్రతి పాఠశాలల్లో ప్రతి తరగతిలోని విద్యార్థులకు రెండు జతలకు అవసరమైన బట్టను తల్లిదండ్రులకు ఇచ్చి కుట్టుకూలి చెల్లించాలని కోరారు. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే వేసవి సెలవుల్లో అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగుపర్చడానికి పోషక విలువలు పెంచేలా భోజన తయారీ ఏజెన్సీలకు చెల్లించే మొత్తాన్నా పెంచుతూ రేషన్‌ సరుకులను ప్రభుత్వమే అందించాలని డిమాండ్‌ చేశారు. ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ సైన్స్‌ విద్యను ప్రవేశపెట్టాలని కోరారు. అన్ని యాజమాన్యాల గురుకులాల్లో ఆరో తరగతి నుంచి ప్రవేశాలను కల్పించాలనీ, లక్కీ డ్రా ద్వారా అడ్మిషన్లు చేపట్టాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిషన్‌ సభ్యులు పీఎల్‌ విశ్వేశ్వరరావు, చారకొండ వెంకటేశ్‌, జ్యోత్స్న శివారెడ్డి, పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు పుల్గం దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్‌, ఆడిట్‌ కమిటీ చైర్మెన్‌ సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -