- – చిన్నపాటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల - వర్షాకాలం వచ్చిందంటే కార్మిక క్షేత్రంలోని లోతట్టు ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. జిల్లాలోని సిరిసిల్ల పురపాలికలో లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాకాలానికి ముందే సమస్యలు తలెత్తే లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉండగా ఆ చర్యలు తీసుకోకపోవడంతో పట్టణం చిన్నపాటి వర్షానికే నీటి నిలువలతో నిండి పోతుంది. అధికారులు ముందస్తు చర్యలకు ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వరద నీరు నిలిచి పలు కాలనీలు చెరువులను తలపించే అవకాశం కనిపిస్తుంది.
- జిల్లా కేంద్రం లో వర్షాలు మొదలయ్యాయి. వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో ముంపు తలెత్తే ప్రమాదం కనిపిస్తుంది. ఇది ప్రతి ఏటా ఉంటుండగా అధికారులు శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. వేల సంఖ్యలో జనాభా ఉండే ప్రాంతాల్లో ముంపు తలెత్తితే నష్టం భారీగానే ఉంటుంది. పట్టణంలో ఒవైపు మురుగు కాలువలు సరిగ్గా లేకపోగా వర్షం నీరు మురుగునీటితో కలిపి రోడ్లపై ప్రవహిస్తుంది. గతేడాది కురిసిన వర్షాలకు చాలా ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎత్తు ప్రదేశంలో ఉన్న కాలనీల నుంచి వచ్చే నీటితో లోతట్టు ప్రాంతాల వారు బయటకు వెళ్లే పరిస్థితి ఉండటం లేదు. ఈసారైనా ఈ పరిస్థితి రాకుండా చూడాలని లోతట్టు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

పలు కాలనీలో ఇక్కట్లు…
సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలో 39 వార్డులకు గాను 19 కాలనీలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. పట్టణంలోని వెంకంపేట ,సర్దార్ నగర్ ,అనంత నగర్, సంజీవయ్య నగర్ ,ఆసిఫ్ పుర ,శాంతినగర్, పెద్ద బజార్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచి ఇండ్లలోకి దుకాణాల్లోకి వెళ్తుంటాయి. మురుగు కాలువలు చిన్నగా ఉండటంతో పాటు పెద్ద మురుగు కాలువల్లో నుంచి సీల్టు తీయకపోవడంతో ఈ పరిస్థితి ఉంది. పట్టణంలో 39 వార్డులకు 59 కాలనీలు ఉండగా సుమారు రెండు లక్షల జనాభా ఉంది .60 వేలకు పైగా ఆవాసాలు ఉన్నాయి. సుమారు 1,20,000 కు పైగా జనాభా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్న పాటి వర్షానికి కాలనీలవాసులు పడే కష్టాలు వర్ణనాధితంగా ఉంటున్నాయి. అనంత నగర్, సర్దార్ నగర్, ఆసిఫ్ పుర, శాంతినగర్, శ్రీనగర్ కాలనీలో ఓ మోస్తారు వర్షం కురిస్తే మోకాళ్ళ లోతు నీళ్లలో నుంచి ప్రజలు నడవాల్సిన పరిస్థితి ఉంది.

లోతట్టు ప్రాంతాల్లో చర్యలేవి…
జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షం పడితే తీసుకోవలసిన కనీస చర్యలు కనిపించడం లేదు. భారీ వర్షాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు చేపట్టి అంతటితో వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ పాలకవర్గం లేకపోవడంతో అధికారులు శాశ్వత పరిష్కారం పై దృష్టి పెట్టడం లేదు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు తప్పడం లేదు. వర్షం వచ్చిందంటే ఈ ప్రాంతాల ప్రజలు వరద నీరు ఎప్పుడు ఇండ్లలోకి వస్తుందోనని భయపడుతున్నారు. కొద్దిపాటి చినుకులకే నీరు రహదారులపై నిలిచి ఇబ్బంది పెడుతుంది .మురుగు కాలువల్లో పూడిక పేరుకుపోయింది సిరిసిల్ల కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్ ప్రాంతాలు మురుగునీరుతో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోతుంది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే ప్రజలకు భారీ నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
