నవతెలంగాణ-హైదరాబాద్ : ఏడాది క్రితం ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. భార్య గర్భం దాల్చడంతో ఇటీవలే బంధువుల సమక్షంలో సంబరంగా సీమంతం జరుపుకొన్నారు. అంతలోనే రోడ్డు ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు భార్యను కబళించగా.. ఆమె మృతిని తట్టుకోలేక భర్త సైతం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుందలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. బిచ్కుందకు చెందిన మంగలి సునీల్(30)కు గతేడాది మద్నూర్ మండలం పెద్దతడ్గూర్ గ్రామానికి చెందిన జ్యోతి(27)తో వివాహమైంది. ఆమె ఐదు నెలల గర్భిణి కాగా ఈ నెల 14న బిచ్కుందలో సీమంతం నిర్వహించారు. అనంతరం జ్యోతిని పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చారు. శుక్రవారం ఉదయం తిరిగి బిచ్కుందకు తీసుకొచ్చేందుకు భర్త సునీల్ వెళ్లారు.
భార్యాభర్తలు ద్విచక్రవాహనంపై వస్తుండగా.. బిచ్కుంద శివారులోని పెద్ద మైసమ్మ గుడి వద్ద వాహనం వేగం కారణంగా జ్యోతి జారి కిందపడ్డారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్సులో బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని బిచ్కుందకు తీసుకురాగా ఇంటి వద్ద కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. విగతజీవిగా మారిన భార్యను చూసి తీవ్ర మనోవేదనకు గురైన సునీల్ బాత్‌రూంలోకి వెళ్లి యాసిడ్ తాగారు. బయటకు వచ్చి వాంతులు చేసుకోవడంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందారు. ఆలుమగల మృతితో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఘోర విషాదం..బైక్ పై నుంచి పడి గర్భిణి మృతి..భర్త ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES