వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని బంధువుల ఆందోళన
కూకట్‌పల్లి అంకుర హాస్పిటల్‌లో ఘటన
నవతెలంగాణ – కూకట్‌పల్లి
ప్రసవం కోసం ఆస్పత్రికి నవ్వుతూ వెళ్ళిన గర్భిణీ కడుపులో పసికందుతో సహా విగతజీవిగా మారిన విషాదకర ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన పాలడుగుల తిరుపతి భార్య సింధూజ(32) మల్లంపేటలో తన భర్తతో నివాసం ఉంటోంది. కాగా గర్భిణి అయిన ఆమె గత ఆరు నెలలుగా కూకట్‌పల్లిలోని అంకుర ఆస్పత్రిలో చెకప్ చేయించుకుంటోంది. ఈ మేరకు శనివారం ఉదయం ప్రసవం కోసం ఆమె అంకుర ఆస్పత్రికి వచ్చింది. నవ్వుతూ డెలివరీకని ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లిన ఆమె.. అర్ధగంటలోలే కడుపులో బిడ్డతో సహా మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో మృతురాలి బంధువులు షాకయ్యారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని ఆస్పత్రిలోనే బైటాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు, ఆమె కడుపులోని బిడ్డ మరణించారని, వైద్యురాలిని ఏం జరిగిందని ప్రశ్నిస్తే ఒకసారి హార్ట్ ఎటాక్ అని, మరోసారి హై బీపీ అని పొంతన లేని సమాధానం చెప్తున్నారని తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమన్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై అంకుర్ హాస్పిటల్ ప్రతినిధి శివ స్పందిస్తూ.. సింధూజ అనే మహిళ ఎమర్జెన్సీ కారణంగా శనివారమే ఆస్పత్రిలో చేరిందన్నారు. ఇంతకుముందు ఆమె తమ వద్దకు ఎటువంటి చికిత్సకు రాలేదన్నారు. హై బీపీతో వచ్చిన ఆమెను ఇంటుబేషన్ చేసే క్రమంలో మృతి చెందిందని తెలిపారు. అయితే మృతురాలు ఈ నెల 20న ఆస్పత్రిలో కన్సల్ట్ అయిన రసీదును ఆమె బంధువులు చూపించడం గమనార్హం.
ప్రసవం కోసం ఆస్పత్ర్రికి వెళ్ళిన గర్భిణీ మృతి
- Advertisement -
- Advertisement -