న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన జెఇఇ మెయిన్ (2026) తుది విడత ఆన్‌లైన్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. తాజాగా జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టిఎ) పేపర్-1 పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్ షీట్లను శనివారం రాత్రి విడుదల చేసింది. ఈ కీపై ఈ నెల 13వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఈ అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం తుది ‘కీ’తో పాటు అభ్యర్థులు సాధించిన మెరుగైన స్కోరును పరిగణనలోకి తీసుకొని ఫైనల్ ర్యాంకులను ప్రకటించనుంది. ఈ ఏడాది జెఇఇ మెయిన్ తుది విడత పరీక్షలకు దాదాపు 11.23 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 11.06 లక్షల మంది పేపర్ -1 (బిఇ/బిటెక్) పరీక్ష రాయగా.. దాదాపు 55 వేల మంది పేపర్-2 (బిఆర్‌కె, బి ప్లానింగ్) పరీక్షకు హాజరయ్యారు. జెఇఇ మెయిన్ పేపర్-1 ఫలితాలను ఈ నెల 20 నాటికి ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇటీవల ఎన్‌టిఎ ఓ ప్రకటనలో తెలిపింది.



