– భూ పత్రాలు, క్యాస్ట్, ఇన్‌కం, బర్త్ సర్టిఫికెట్లు
– రూ.5 వేల నుంచి 20వేలకు విక్రయం
– కోర్టు కేసులు, లోన్లకు సహకరిస్తున్న నిందితులు
– ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు
– 30 ఏండ్లనాటి పేపర్స్, డాక్యుమెంట్లు, రబ్బర్ స్టాప్స్ స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో…హయత్‌నగర్
నకిలీ సేల్ డీడ్‌లు, భూపత్రాలు, ఇతర సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. సేల్ డీడ్‌లు, భూ పత్రాలు, ఇన్‌కం, బర్త్ సర్టిఫికెట్లు తదితర డాక్యుమెంట్లను తయారు చేస్తున్న 13 మంది ముఠా సభ్యుల్లోని ఆరుగురు నిందితులను సరూర్‌నగర్, ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుల నుంచి 546 బాండ్ పేపర్స్, 48 బర్త్ సర్టిఫికెట్లు, 11 ఆదాయం సర్టిఫికెట్లు, 5 క్యాస్ట్ సర్టిఫికెట్లు, 30 ఏండ్ల కిందటి పేపర్స్, జీహెచ్‌ఎంసీ, న్యూరో సర్జన్ డాక్టర్లు, రెవెన్యూ, నోటరీలకు చెందిన రబ్బర్ స్టాంప్స్, రసాయనాలు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, కోర్టులు సైతం గుర్తించలేని విధంగా నకిలీ సేల్ డీడ్‌లు, ఇతర డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారని రాచకొండ సీపీ జి.సుధీర్‌బాబు తెలిపారు. శుక్రవారం ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెళ్లడించారు.
హయత్‌నగర్ కుంట్లూర్‌కు చెందిన తోట వెంకట భానుప్రసాద్, ఆయన భార్య సాగరిక కలిసి స్థానికంగా ‘సాత్విక్ ఎంటర్‌ప్రైజెస్’ను నిర్వహిస్తున్నారు. డీటీపీ వర్క్ చేసే వారు. అద్దె అగ్రిమెంట్లు, సేల్ డీడ్‌లు, అఫిడవిట్‌లపై టైప్ చేసేవారు. ఈ క్రమంలో లైసెన్స్ స్టాంప్ వెండర్లయిన హయత్‌నగర్‌కు చెందిన ఏ.చంద్రశేఖర్, అతని కుమారుడు అనిల్‌తో పరిచయం ఏర్పడింది. తద్వారా పాత స్టాంప్ పేపర్స్, నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి అధిక ధరలకు విక్రయించడం ప్రారంభించారు. ఈ క్రమంలో సివిల్ కోర్టులో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్న సయ్యద్ ఫెరోజ్ అలీ, అంబర్‌పేట్‌కు చెందిన ఏండీ జలీల్‌తోనూ వారికి పరిచయం ఏర్పడింది. నకిలీ డాక్యుమెంట్లు, సేల్ డీడీల తయారీతో కష్టపడకుండా డబ్బులు వస్తుండటంతో వరంగల్‌కు చెందిన పి.మహేష్‌గౌడ్, కామారెడ్డి మున్సిపాల్టీలో ఔట్‌సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ప్రవీణ్, నార్సింగ్ మున్సిపాల్టీలో పనిచేస్తున్న డి.సుధీర్ కుమార్ (ఔట్ సోర్సింగ్), బండ్లగూడ మున్సిపాల్టీలో పనిచేస్తున్న ముద్దుసర్ (ఔట్ సోర్సింగ్)తో చేతులు కలిపారు.
వారి సహాయంతో కులం, బర్త్, ఆదాయం సర్టిఫికెట్లతోపాటు ఇతర సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారు. ఆస్పత్రులు, రెవెన్యూ నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే నకిలీవి సృష్టిస్తున్నారు. దాంతోపాటు చౌటుప్పల్‌కు చెందిన జలీల్ కిషోర్, ఖమ్మం జిల్లాకు చెందిన చెంచల నిఖిల్, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సత్యప్రభుతో కలిసి రబ్బర్ స్టాంప్‌లు, నకిలీ సేల్ డీడ్‌లు కూడా తయారు చేస్తున్నారు. మొత్తం 13 మంది ఒక ముఠాగా ఏర్పడ్డారు. బ్యాంక్ లోన్లు తీసుకునే వారికి, కోర్టులో కేసులు వేసేవారితోపాటు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లను విక్రయిస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్ రూ.5వేల నుంచి రూ.20వేల వరకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిఘా వేసి ఆరుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. డాక్యుమెంట్లపై అనుమానం వస్తే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లేదా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పరిశీలించాలని చెప్పారు. కేసును ఛేదించిన ఎస్‌వోటీ, సరూర్‌నగర్ పోలీసులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ షాకీర్ హుస్సేయిన్, ఎల్బీనగర్ ఏసీపీ కిష్టయ్య, సరూర్‌నగర్ సీఐ సైదిరెడ్డి, ఎస్‌వోటీ సీఐ వెంకటయ్య తదితరులు ఉన్నారు.
నకిలీ సేల్ డీడ్‌ల తయారీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES