న్యూఢిల్లీ : జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించామని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టొరల్ కాలేజీని ఏర్పాటు చేసే ప్రక్రియను మొదలు పెట్టామని తెలిపింది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు కూడా ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం జరిగే పోలింగ్‌లో ఓటు వేస్తారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక నిర్వహణ కోసం రిటర్నింగ్ అధికారిని, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను ఖరారు చేసే పని కూడా జరుగుతోంది. ‘సన్నాహకాలు పూర్తి చేసిన తర్వాత ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం షెడ్యూల్ ప్రకటిస్తాం. ఈ పని త్వరలోనే జరుగుతుంది’ అని ఈసీ తెలిపింది. ఆరోగ్య కారణాలు చూపుతూ జగదీప్ ధన్‌ఖడ్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లాంఛనంగా నోటిఫై చేసింది. ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్న వారు మరణించినా, రాజీనామా చేసినా లేక వారిని తొలగించినా ‘సాధ్యమైనంత త్వరగా’ ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంటుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లో క్లాజ్ 2 నిర్దేశిస్తోంది. ఎన్నికైన అభ్యర్థి ఐదు సంవత్సరాల పాటు ఉప రాష్ట్రపతి పదవిలో కొనసాగుతారు.