Sunday, May 4, 2025
Homeరాష్ట్రీయంఐదేండ్ల ప్రణాళికలు సిద్ధం చేయండి

ఐదేండ్ల ప్రణాళికలు సిద్ధం చేయండి

- Advertisement -

– అధికారులకు ఇంథనశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

భవిష్యత్‌ విద్యుత్‌ డిమాండ్‌కు తగినట్టు వచ్చే ఐదేండ్ల ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంథనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరుగుతున్నదనీ, దానికి తగినట్టే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని చెప్పారు. శనివారంనాడిక్కడి విద్యుత్‌సౌధలో తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణి సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) పరిధిలో ఐదేండ్ల కార్యాచరణ ప్రణాళికలను సమీక్షించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో అత్యధిక డిమాండ్‌ 16,877 మెగావాట్లకు చేరుకుంటుందని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనా వేసిందనీ, దానికి భిన్నంగా గరిష్ట డిమాండ్‌ 17,162 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. దీన్నిబట్టి 2026 ఆర్థిక సంవత్సరంలో గరిష్ట డిమాండ్‌ 19వేల మెగావాట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేశామన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఇబ్రహీంబాగ్‌, గచ్చిబౌలి, పటాన్‌చెరు, కందుకూరు, మేడ్చల్‌ డివిజన్ల పరిధిలో విద్యుత్‌ డిమాండ్‌ 20 శాతం వరకు పెరుగుతున్నదని అధికారులు తెలిపారు. దీన్ని తట్టుకోవాలంటే దాదాపు 40శాతం నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ పాయింట్ల ఆపరేటర్లతో సమావేశమయ్యారు. 2030 నాటికి రాష్ట్రంలో 6 వేల ఎలక్ట్రిక్‌ వెహికల్‌ పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దీనికి సంబంధించి టీజీరెడ్‌కో, డిస్కమ్‌లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని వివరించారు. అలాగే ఈవీ చార్జింగ్‌ కేంద్రాలు ఎల్‌టీ-9 కేటగిరిలో ఉన్నాయనీ, వాటి కాంట్రాక్ట్‌లోడ్‌ను పెంచామని తెలిపారు. సమస్యలను అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు తేవాలని సూచించారు. కార్యక్రమంలో టీజీఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ ముషారఫ్‌ ఫరూఖీ, జేఎమ్‌డీ శ్రీనివాసరావు, టీజీరెడ్కో సీఎమ్‌డీ శ్రీమతి అనిల, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, థండర్‌ ప్లస్‌, ఆక్సోనిఫై టెక్‌ సిస్టమ్స్‌, డీ అండ్‌ టీ హబ్‌ ప్రతినిధులు, జోనల్‌ చీఫ్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -