వేములవాడ యువకుడు మని సాయి వర్మకు జాతీయ స్థాయి గుర్తింపు..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ గ్రామీణ మండలం నమిలిగుండు పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగపల్లి మల్లేశం–భాగ్య దంపతుల కుమారుడు మని సాయి వర్మ రాష్ట్రపతి అవార్డును అందుకుని ప్రతిష్ఠత సాధించాడు. సిఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న మని సాయి వర్మ, నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్) స్వచ్ఛంద సేవా సంస్థలో చేరి సమాజ సేవలో విశేష కృషి చేశాడు.ఈ క్రమంలో సమాజ కోసం చేపట్టిన కార్యక్రమాలు, సేవా చొరవలకుగాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా, సోమవారం నాడు ఢిల్లీలోని రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి పురస్కారం అందుకున్నాడు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు మని సాయి వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. యువత సమాజ సేవలో ముందుకు వచ్చి రాష్ట్రానికి మరిన్ని అవార్డులు తేవాలని ఆకాంక్షించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కుమ్మరి కుల సభ్యులు మని సాయి వర్మను అభినందిస్తూ సత్కరించారు.