అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు దేశ రాష్ట్రపతి పద్నాలుగు ప్రశ్నలు సంధించడం, న్యాయ సలహా కోరడం ఆశ్చర్యంగా ఉంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలను పరిరక్షిస్తూ అన్ని వ్యవస్థలను కాపాడవలసిన ప్రధాన బాధ్యత రాజ్యాంగ వ్యవస్థలదే. ప్రథమ పౌరుడు అంటే రాష్ట్రపతి నుండి మొత్తం పౌరులందరికీ చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. ప్రతిఒక్కరూ తమ విధులను సకాలంలో నిర్వర్తించాలి. ఎవరికీ ఎటువంటి మినహాయింపు ఉండకూడదు. నిర్దిష్ట కాల పరిమితిలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడంలో తప్పేమీలేదు. అది పూర్తిగా సముచితమే. మరి అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో అనేక బిల్లులు ప్రవేశపెడతాయి. వాటి ఆమోదం తర్వాత మాత్రమే ఆ బిల్లులను గవర్నర్ల వద్దకు తుది ఆమోదముద్ర కోసం పంపిస్తారు. తమిళనాడు, కేరళతో సహా ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన తర్వాత కూడా గవర్నర్లు రాజకీయ ఉద్దేశాలతో ఆ బిల్లులను అనేక నెలలపాటు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తొక్కిపెట్టారు. రాష్ట్రాల హక్కులను హరించడమే కాకుండా, దాడి కూడా. అందువల్లనే ఇటీవల కొన్ని రోజుల కిందట సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఇందులో కీలకమైన తీర్పు ఏమిటో కూడా చూడాలి. గవర్నర్లను కచ్చితంగా ఆమోదించి తీరాలని కోర్టు ఎక్కడా చెప్పలేదు. కాలయాపన లేకుండా నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోమని మాత్రమే స్పష్టం చేసింది. అసలు రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి తగిన విధంగా జోక్యం చేసుకుని తనకున్న విశిష్టమైన అధికారాలతో గవర్నర్లకు సరైన దిశానిర్దేశం చేస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యేవే కాదు. పైగా గవర్నర్ల నియామకాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కూడా తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలే కాదు, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలపైనా ఆధిపత్యం చెలాయించే ధోరణి పెరిగింది. ఇప్పటికైనా రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమన్వయం అవసరం. దానికి రాజకీయపరమైన వివాదాలకు తావివ్వకుండా గవర్నర్లు వ్యవహరిస్తేనే ఈ సమస్యకు ముగింపు. అందుకు కేంద్ర ప్రభుత్వం హుందాగా వ్యవహరించాలి. అన్ని రాష్ట్రాలను వివక్షలేకుండా సమానంగా చూడాలి. నిధులు, ఇతర అభివృద్ధి విషయాల్లో సహకరించాలి. గవర్నర్లను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలు సమచితం కాదన్న విషయాన్ని గ్రహించాలి.
- వి.వి.కే.సురేష్, 9440345850