Monday, November 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమీడియా స్వేచ్ఛ నియంత్రణకు ప్రెస్‌ కౌన్సిల్‌ అవసరం

మీడియా స్వేచ్ఛ నియంత్రణకు ప్రెస్‌ కౌన్సిల్‌ అవసరం

- Advertisement -

సీనియర్‌ సంపాదకులు దేవులపల్ల అమర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

మీడియా స్వేచ్ఛతోపాటు మీడియాను అదుపు చేసేందుకు ప్రభుత్వ ఆజమాయిషీ లేని ప్రెస్‌కౌన్సిల్‌ లాంటి వ్యవస్థలు అవసరమని సీనియర్‌ సంపాదకులు దేవులపల్లి అమర్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌, నాంపల్లిలోని మీడియా అకాడమి ఆడిటోరియంలో సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ మీడియా అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవాన్ని (నేషనల్‌ ప్రెస్‌ డే) పురస్కరించుకుని ‘అసత్య వార్తలు- మీడియా విశ్వసనీయత- రక్షణ’అనే అంశంపై సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా అమర్‌ మాట్లాడుతూ సమాజంలో మీడియా పేరుతో జరుగుతున్న దుష్ట ప్రయోగాలను ఎండ గట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వర్కింగ్‌ జర్నలిస్టులు, వార్తా పత్రికలు, చట్టాలు ఎలా రూపొందించాలో ఆనాటి ప్రధానమంత్రి జవహార్‌లాల్‌ నెహ్రూ సూచనమేరకు దేశంలో మొదటి ప్రెస్‌ కమిషన్‌తోపాటు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను 1966 నవంబర్‌ 16న ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

అదే రోజునే జాతీయ పత్రికా దినోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని గుర్తు చేశారు. కొన్ని పత్రికలు, ఛానెల్స్‌ యాజమాన్యాలు మీడియా సంస్థలు నైతిక నియామావళిని పాటించడం లేదన్నారు. తప్పుడు వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయడం వల్ల మీడియా మొత్తాన్ని దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టాలంటే మీడియా సంస్థలు, సంఘాలు అన్ని ఒక తాటిపై వచ్చి మనపై ఉన్న అభద్రతాభావాన్ని తొలగించాల్సిన అవసరముందన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు ప్రభుత్వం తరుపున తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యల కోణంలో మీడియా సంస్థలు పని చేయాలని ఆకాంక్షించారు. వార్త విశ్వసనీయత పరిశీలించి నిజాలను నిర్ధారణ చేసుకున్న తర్వాతే వార్తలు ప్రచురించాలని సూచించారు.

వార్తల్లో వ్యక్తిగత అభిప్రాయాలను చొప్పించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. వ్యక్తులు, రాజకీయ పార్టీలకు కొమ్ముకాయకుండా స్వతంత్రంగా మీడియా సంస్థలు వ్యవహరించాలని కోరారు. అనుదినం జనస్వరం వినిపిస్తూ ప్రతి అక్షరం ప్రజల పక్షం ఉంటేనే ఆ సంస్థలకు మనుగడ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డిఎస్‌. జగన్‌ అధ్యక్షత వహించారు. జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు మారుతి సాగర్‌, మాజీద్‌, రమణారావు, రంగసాయి, యూసుఫ్‌బాబు, రమణ కుమార్‌, సువర్ణ, తదితరులు నేషనల్‌ ప్రెస్‌ డే సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి తమ సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ డైరెక్టర్‌ కె. వెంకట రమణ, మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, అధికారులు, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -